Viral: ఈమె అసలు తల్లేనా.. వివాహేతర సంబంధం.. ఆపై క్రైమ్ షో స్ఫూర్తితో..
ABN, Publish Date - Aug 27 , 2024 | 03:34 PM
వివాహేతర సంబంధంలో ఉన్న ఓ మహిళ తన కన్నకూతురిని నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకున్న దారుణ ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. టీవీలో వచ్చే క్రైమ్ షో స్ఫూర్తిగా ఆమె ఒడిగట్టిన దారుణం సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన కన్నకూతురిని నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకున్న దారుణ ఘటన బీహార్‌లో (Bihar) వెలుగు చూసింది. టీవీలో వచ్చే క్రైమ్ షో స్ఫూర్తిగా ఆమె ఒడిగట్టిన దారుణం సంచలనంగా మారింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, కాజల్ అనే వివాహితకు మూడేళ్ల కూతురు ఉంది. అయితే, మరో యువకుడితో వివాహేతర సంబంధంలో ఉన్న ఆమె భర్తతో విడిపోవాలని భావించింది. కూతురితో పాటు బాయ్‌ఫ్రెండ్ దగ్గరకు వెళదామనుకుంటే అతడు నిరాకరించాడు. దీంతో, కూతురు తనకు అడ్డంకిగా మారిందని భావించిన ఆమె చిన్నారిని అత్యంత కర్కశంగా కడతేర్చింది. చిన్నారి గొంతుకోసి హత్య చేసి ఆపై మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి బయటపారేసింది.
Viral: చోరీకొచ్చి పురాణం చదువుతూ లోకం మర్చిపోయిన దొంగ.. చివరకు..
ముజఫర్‌పూర్‌లోని మీనాపూర్ ప్రాంతంలో శనివారం సూట్‌కేసులో చిన్నారి మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కాజల్ ఒడిగట్టిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. మహిళ ఇంటిని సందర్శించిన ఫారెన్సిక్ నిపుణులు చిన్నారి రక్తం ఆనవాళ్లను గుర్తించారు. గదిలోని సింకులో కూడా రక్తం ఆనవాళ్లు బయటపడ్డాయి. కాజల్ జాడ మాత్రం కనిపించలేదు. మరోవైపు, ఘటన జరిగిన రోజున ఆమె తన భర్తకు ఫోన్ చేసి తన బంధువు ఇంటికి వెళుతున్నట్టు సమాచారం ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో కాజల్ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆమె జాడ కనుక్కుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఆమె వివాహేతర సంబంధం, కూతురి హత్య గురించి వెలుగులోకి వచ్చింది. ‘‘ఆమె కూతురిని కూడా తీసుకుని బాయ్‌ఫ్రెండ్ వద్దకు వెళ్లిపోవాలనుకుంది. కానీ అతడు నిరాకరించాడు. దీంతో, ఏం చేయాలో పాలుపోని ఆమె చివరకు కూతురిని హత్య చేసి అడ్డుతొలగించుకొంది. తరువాత మృత దేహాన్ని సూట్ కేసులో పెట్టి విసిరేసింది.’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
హత్య తాలూకు ఆనవాళ్లు దొరక్కుండా ఆమె తన గది, ఇంటి టెర్రెస్‌ను శుభ్రపరిచిందని, కానీ ఫోరెన్సిక్ టీం మాత్రం చిన్నారి రక్తం ఆనవాళ్లను సేకరించగలిగిందని అన్నారు. హత్యకు వాడిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ హత్య ఆమె తనంతట తానుగా చేసిందని, ఇందులో ఆమె బాయ్ ఫ్రెండ్ పాత్ర ఏమీ లేదని కూడా అన్నారు. కాాగా, కన్నకూతురిని నిందితురాలు పొట్టనపెట్టుకున్న తీరు స్థానికంగా కలకలం రేపుతోంది.
Updated Date - Aug 27 , 2024 | 04:05 PM