Share News

ఆనంద్‌ను దాటేసిన అర్జున్‌

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:05 AM

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేసి అర్జున్‌ క్లాసిక్‌ చెస్‌ విభాగం అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో పదోస్థానంతో టాప్‌-10లోకి ప్రవేశించి సంచలనం సృష్టించాడు...

ఆనంద్‌ను దాటేసిన అర్జున్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేసి అర్జున్‌ క్లాసిక్‌ చెస్‌ విభాగం అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో పదోస్థానంతో టాప్‌-10లోకి ప్రవేశించి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను అధిగమించాడు. క్లాసిక్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ప్రస్తుతం అర్జున్‌ (2754.6) ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. ఆనంద్‌ (2751) 11వ, ప్రజ్ఞానంద 15వ, గుకేష్‌ 16వ ర్యాంకుల్లో నిలిచారు. బ్లిట్జ్‌లో టాప్‌-20లో భారత్‌ నుంచి ఇద్దరే ఉన్నారు. ఇందులో అర్జున్‌ 13వ ర్యాంక్‌లో నిలవగా, ఆనంద్‌ 18వ స్థానంలో ఉన్నాడు. ఇక, చైనాలో జరుగుతున్న షెంగ్జెన్‌ మాస్టర్స్‌ టోర్నీలో సోమవారం ముగిసిన నాలుగో రౌండ్‌లో అర్జున్‌ తెల్ల పావులతో బరిలోకి దిగాడు. సుదీర్ఘంగా సాగిన ఈ పోరులో అర్జున్‌ 70వ ఎత్తుల్లో చైనా జీఎం మా కున్‌పై గెలిచాడు. ఈ టోర్నీలో అర్జున్‌కు ఇది మూడో విజయం. చైనా జీఎంలు బు జియాంగ్జి, యు యాంగితో కలిసి అర్జున్‌ ప్రస్తుతం 3 పాయింట్లతో సమంగా ఉన్నా, మెరుగైన టైబ్రేక్‌ స్కోరు కారణంగా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచాడు.

Updated Date - Mar 05 , 2024 | 02:05 AM