బూమ్ బూమ్.. బుమ్రా
ABN , Publish Date - Feb 04 , 2024 | 04:28 AM
ఓపెనర్ యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ (290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 209)తో భారీ స్కోరు సాధిస్తే.. ఆ తర్వాత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (6/45) స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి వెన్నువిరిచాడు...
ఆరు వికెట్లతో విజృంభణ
భారత్ తొలి ఇన్నింగ్స్ 396
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 253
రోహిత్ సేన ఆధిక్యం 171
రెండో టెస్టు
విశాఖపట్నం (స్పోర్ట్స్): ఓపెనర్ యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ (290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 209)తో భారీ స్కోరు సాధిస్తే.. ఆ తర్వాత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (6/45) స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. ఫ్లాట్ వికెట్‌పై ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటతో చెలరేగుతుందనుకున్నా.. మిడిలార్డర్‌లో రూట్ (5), పోప్ (23), బెయిర్‌స్టో (25), బెన్ స్టోక్స్ (47), హార్ట్‌లీ (21)లకు బుమ్రా కళ్లెం వేయడంతో పర్యాటక జట్టు కుదేలైంది. ఫలితంగా రెండో టెస్టులో భారత్ ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, ఉప్పల్ టెస్టులోనూ రెండో రోజు ముగిసేసరికి భారత్ 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కానీ, ఆ తర్వాత ఆ మ్యాచ్ ఎలా ముగిసిందో అందరం చూశాం. ఈసారి అలాంటి ఫలితం రాకుండా ఉండాలంటే ఆదివారం మన బ్యాటర్లు విజృంభించి భారీ ఆధిక్యం దక్కించుకోవాలి. ఇక.. శనివారం ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. అండర్సన్, బషీర్, రెహాన్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 253 పరుగులకు కుప్పకూలింది. జాక్ క్రాలే (76) అర్ధసెంచరీ సాధించాడు. కుల్దీప్ యాదవ్‌కు 3 వికెట్లు లభించాయి. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. డబుల్ సెంచరీ హీరో జైస్వాల్ (15 బ్యాటింగ్), రోహిత్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
యశస్వీ డబుల్: రెండో రోజు ఆటలో తమ ఓవర్‌నైట్ స్కోరు 336/6కు భారత్ మరో 60 పరుగులు జోడించగలిగింది. ఇందులో యశస్వీవే 30 రన్స్ ఉన్నాయి. బషీర్ ఓవర్‌లో వరుసగా 6,4తో జైస్వాల్ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. అశ్విన్ (20)తో కలిసి ఏడో వికెట్‌కు 34 రన్స్ జోడించాడు. అనంతరం భారీ షాట్‌కు వెళ్లిన జైస్వాల్‌ను అండర్సన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత లంచ్‌కు అరగంట ముందు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
స్వింగ్ దెబ్బకు ఢమాల్: ఫ్లాట్ వికెట్‌పై బుమ్రా రివర్స్ స్వింగ్‌తో మాయ చేశాడు. కళ్లు చెదిరే యార్కర్లకు తోడు అవుట్ స్వింగ్, ఇన్‌స్వింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. భాగస్వామ్యం ఏర్పడిన ప్రతిసారీ కెప్టెన్ రోహిత్ బంతిని బుమ్రాకు అందించాడు. అందుకు తగ్గట్టే కెప్టెన్ నమ్మకాన్ని బుమ్రా నిలబెట్టాడు. కుల్దీప్ సైతం బుమ్రాకు మరో ఎండ్ నుంచి సహకరించాడు. వీరి దెబ్బకు ఇంగ్లండ్ 55.5 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. తొలి టెస్టు హీరో పోప్‌ను సూపర్ యార్కర్‌తో, కెప్టెన్ స్టోక్స్‌ను కట్టర్‌తో బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేసిన తీరు అద్భుతం. వాస్తవానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ వారి సహజశైలికి తగ్గట్టుగా ధాటిగానే సాగింది. ఓపెనర్లు క్రాలే, డకెట్ (21) తొలి వికెట్‌కు 59 రన్స్ చేర్చారు. ముఖ్యంగా స్పిన్నర్లపై క్రాలే ఎదురుదాడికి దిగి రన్స్ రాబట్టాడు. అయితే, అక్షర్ బౌలింగ్‌లో శ్రేయాస్ బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి వెనక్కి పరిగెడుతూ అందుకున్న క్యాచ్‌తో క్రాలే వెనుదిరిగాడు. పోప్‌తో క్రాలే రెండో వికెట్‌కు 55 రన్స్ జత చేశాడు. ఆ తర్వాత మిడిలార్డర్‌ను కుదురుకోనీయకుండా వరుస ఓవర్లలో రూట్, పోప్‌ను బుమ్రా అవుట్ చేయడంతో ఇంగ్లండ్ లంచ్ బ్రేక్ సమయానికి 155/4 స్కోరుతో నిలిచింది.
స్టోక్స్ పోరాడినా..: ఆఖరి సెషన్‌లోనూ బుమ్రా కదం తొక్కి ఆరంభంలోనే బెయిర్‌స్టోను అవుట్ చేశాడు. ఫోక్స్ (6), రెహాన్ (6)లను కుల్దీప్ దెబ్బతీయగా.. చివర్లో కెప్టెన్ స్టోక్స్ పోరాటానికి హార్ట్‌లీ సహకరించాడు. ఇద్దరూ బౌలర్లను ఎదుర్కొంటూ ఎనిమిదో వికెట్‌కు 47 రన్స్ జత చేశారు. ఈ దశలో మళ్లీ బంతి పట్టిన బుమ్రా ఫలితం సాధించాడు. 50వ ఓవర్‌లో నమ్మశక్యంకాని కట్టర్‌తో స్టోక్స్‌ను బౌల్డ్ చేసి కెరీర్‌లో 150వ వికెట్ పూర్తి చేశాడు. అటు స్టోక్స్ ‘వాట్ ఈజ్ దిస్ బాల్’ అన్నట్టుగా రెండు చేతులూ చాపి నిరాశగా వెళ్లాడు. ఆ తర్వాత హార్ట్‌లీ, అండర్సన్ (6)లను కూడా అవుట్ చేసిన బుమ్రా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు చెక్ పెట్టాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 209, రోహిత్ (సి) పోప్ (బి) బషీర్ 14, గిల్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 34, శ్రేయాస్ (సి) ఫోక్స్ (బి) హార్ట్‌లీ 27, రజత్ (బి) రెహాన్ 32, అక్షర్ (సి) రెహాన్ (బి) బషీర్ 27, భరత్ (సి) బషీర్ (బి) రెహాన్ 17, అశ్విన్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 20, కుల్దీప్ (నాటౌట్) 8, బుమ్రా (సి) రూట్ (బి) రెహాన్ 6, ముకేశ్ (సి) రూట్ (బి) బషీర్ 0, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 396 ఆలౌట్; వికెట్ల పతనం: 1-40, 2-89, 3-179, 4-249, 5-301, 6-330, 7-364, 8-383, 9-395, 10-396; బౌలింగ్: అండర్సన్ 25-4-47-3; రూట్ 14-0-71-0; హార్ట్‌లీ 18-2-74-1; బషీర్ 38-1-138-3; రెహాన్ 17-2-65-3.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (సి) శ్రేయాస్ (బి) అక్షర్ 76, డకెట్ (సి) రజత్ (బి) కుల్దీప్ 21, పోప్ (బి) బుమ్రా 23, రూట్ (సి) గిల్ (బి) బుమ్రా 5, బెయిర్‌స్టో (సి) గిల్ (బి) బుమ్రా 25, స్టోక్స్ (బి) బుమ్రా 47, ఫోక్స్ (బి) కుల్దీప్ 6, రెహాన్ (సి) గిల్ (బి) కుల్దీప్ 6, హార్ట్‌లీ (సి) గిల్ (బి) బుమ్రా 21, అండర్సన్ (ఎల్బీ) బుమ్రా 6, బషీర్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 253 ఆలౌట్; వికెట్లపతనం: 1-59, 2-114, 3-123, 4-136, 5-159, 6-172, 7-182, 8-229, 9-234, 10-253; బౌలింగ్: బుమ్రా 15.5-5-45-6; ముకేశ్ 7-1-44-0; కుల్దీప్ 17-1-71-3; అశ్విన్ 12-0-61-0; అక్షర్ 4-0-24-1.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 15, రోహిత్ (బ్యాటింగ్) 13; మొత్తం: 5 ఓవర్లలో 28/0; బౌలింగ్: అండర్సన్ 2-0-6-0; బషీర్ 2-0-17-0; రెహాన్ 1-0-5-0.
1
భారత్ నుంచి టెస్టుల్లో అత్యంత వేగం (34 టెస్టులు, 6781 బంతుల్లో)గా 150 వికెట్లు తీసిన పేసర్‌గా బుమ్రా. అలాగే వకార్ యూనిస్ (27 టెస్టులు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆసియా పేసర్‌గా బుమ్రా నిలిచాడు.
స్వదేశంలో ఓ భారత పేసర్ (బుమ్రా 6/45) అద్భుత గణాంకాలు నమోదు చేయడం ఈ శతాబ్ధంలో ఇదే తొలిసారి.
2
టెస్టుల్లో మెరుగైన సగటు (20.28)తో 150+ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా బుమ్రా. సిడ్నీ బేర్నెస్ (ఇంగ్లండ్, 16.43) టాప్‌లో ఉన్నాడు.