WTC Final: కివీస్ చేతిలో అనూహ్య ఓటమి.. భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఎలా
ABN, Publish Date - Oct 20 , 2024 | 03:12 PM
బెంగళూరు టెస్టులో ఓటమి ప్రభావంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ పాయింట్లు స్వల్పంగా తగ్గాయి. మొత్తం 9 జట్లు ఉండే ఈ పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. బెంగళూరు ఓటమి తర్వాత పాయింట్లు 74.24 శాతం నుంచి 68.06 శాతానికి తగ్గాయి. మరి భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉందా?
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. దాదాపు 36 ఏళ్ల తర్వాత తొలిసారి స్వదేశంలో కివీస్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. అందుకే న్యూజిలాండ్‌కు ఈ గెలుపు చారిత్రాత్మకమైనది. రెండవ ఇన్నింగ్స్‌లో భారత్ వీరోచిత బ్యాటింగ్ చేసినప్పటికీ కివీస్ విజయాన్ని నిలువరించలేకపోయింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ విజయాన్ని అందుకున్నారు.
కాగా ఈ ఓటమి ప్రభావంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ పాయింట్లు స్వల్పంగా తగ్గాయి. మొత్తం 9 జట్లు ఉండే ఈ పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. బెంగళూరు ఓటమి తర్వాత పాయింట్లు 74.24 శాతం నుంచి 68.06 శాతానికి తగ్గాయి. పాయింట్లు తగ్గినప్పటికీ భారత్ వరుసగా మూడవసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉందా? అంటే.. ఉందనే చెబుతున్నారు క్రికెట్ నిపుణులు. బెంగళూరు టెస్టులో ఓటమి భారత్ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసినప్పటికీ.. మూడోసారి ఫైనల్‌కు అర్హత సాధించేందుకు చేరువలోనే ఉన్నారని అంటున్నారు. ఫైనల్ చేరే విషయంలో ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని, అయితే ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఆడాలని సూచిస్తున్నారు.
కాగా ప్రస్తుత డబ్ల్యూటీసీలో భారత్‌కు మరో 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో 2, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధిస్తే 64.03 పాయింట్లతో టీమిండియా ఫైనల్ చేరుతుంది. ఐదవ విజయాన్ని కూడా సాధిస్తే 69.29 శాతంతో ఫైనల్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు. జూన్ 11 నుంచి జూన్ 15 మధ్య లార్డ్స్ వేదికగా ఫైనల్ ఆడడం కూడా ఖాయమవుతుంది.
అయితే మిగిలిన ఏడు టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధిస్తే పాయింట్లు 53.50 శాతానికి పడిపోతాయి. ఈ సమీకరణంలో భారత్ ఫైనల్ బెర్త్ సంక్లిష్టంగా మారుతుంది. ఇక ఏడింట మూడు విజయాలు సాధిస్తే 58.77 శాతం పాయింట్లు సాధించినా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. ఇతర జట్ల నుంచి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్న శ్రీలంక నుంచి గట్టి పోటీకి అవకాశం ఉంటుంది. శ్రీలంక జట్టు కూడా గరిష్ఠంగా 56.63 శాతం పాయింట్లు పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు న్యూజిలాండ్ నుంచి కూడా గట్టి పోటీ ఉంటుంది. కాబట్టి భారత్ జట్టు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడానికి మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో 4 నుంచి 5 విజయాలు సాధిస్తే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. కాగా గత డబ్ల్యూటీసీ ఫైనలిస్టులుగా ఆస్ట్రేలియా, భారత్ కటాఫ్ పాయింట్లు వరుసగా 66.67 శాతం, 58.80 శాతంగా ఉన్నాయి.
Updated Date - Oct 20 , 2024 | 03:12 PM