Rohit-Virat: రోహిత్, కోహ్లీలకు కొత్త ఫిట్టింగ్.. అలాగైతే చాలా కష్టమే!
ABN, Publish Date - Jul 25 , 2024 | 03:04 PM
టీ20 వరల్డ్‌కప్‌లో టైటిల్ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి అభిమానుల్లో..
టీ20 వరల్డ్‌కప్‌లో టైటిల్ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి అభిమానుల్లో ఒకటే ఆందోళన నెలకొంది. 2027లో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ వరకు వీళ్లిద్దరు కొనసాగుతారా? లేకపోతే మధ్యలోనే గుడ్‌బై చెప్పేస్తారా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే.. అలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఆ స్టార్ క్రికెటర్లిద్దరూ 2027 వన్డే వరల్డ్‌కప్ (2027 ODI World Cup) వరకు కొనసాగుతారని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) గుడ్ న్యూస్ చెప్పాడు. ఇలాంటి తరుణంలో.. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇద్దరికి యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ తప్పదని కుండబద్దలు కొట్టాడు.
యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ
‘‘2027 వన్డే వరల్డ్‌కప్‌లోనూ కోహ్లీ, రోహిత్ ఆడాలంటే.. రెండు విషయాలు ఎంతో కీలకం. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉండాలి. ఆటపై ఆసక్తితో పాటు ప్రేరణ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. రోహిత్, కోహ్లీ ఇప్పటికే అత్యున్నత స్థానాలకు చేరారు. సంకల్పంతో రాణిస్తున్నారు కాబట్టే.. ఈరోజు వాళ్లు ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే.. శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్ లాంటి యువ ఆటగాళ్లు ఈమధ్య ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు. మైదానంలో వాళ్లు భారీ పరుగులు రాబడుతూ.. ముందుకు దూసుకొస్తున్నారు. ఇలాంటప్పుడు.. రోహిత్, కోహ్లీ అద్భుత ప్రదర్శను కొనసాగించాలి. గతంలో చాలాసార్లు వాళ్లు అది చేసి చూపించారు. ఇక ముందు కూడా అదే ప్రతిభను కనబరుస్తూ ఉండాలి’’ అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. సింపుల్‌గా చెప్పాలంటే.. సీనియర్లైన రోహిత్, కోహ్లీలకు యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఉందని.. దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్తేనే వన్డే వరల్డ్‌కప్ వరకూ రాణించగలరని అభిప్రాయపడ్డాడు.
ఇంకా చాలా సమయం ఉంది
అయినా.. 2027 వరల్డ్‌కప్ అనేది ఇంకా చాలా దూరంలో ఉందని, ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచించడం మంచిదేనని నెహ్రా తెలిపాడు. ఒకవేళ తనని జీవితాంతం 18 ఏళ్లుగానే ఉండాలని అడిగితే.. తాను రిటైర్‌మెంట్ తీసుకోనని అన్నాడు. గంభీర్‌కు అవకాశం ఇచ్చినా.. సాయి సుదర్శన్ లాంటి వాళ్లను కాదని తానే రంగంలోకి దిగుతాడని చెప్పాడు. అంటే.. వయసు మీద పడుతున్నప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న కోణంలో.. నెహ్రా ఆ కామెంట్లు చేశాడు. ఏదేమైనా.. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, అప్పటివరకూ పరిణామాలు ఎలా మారుతాయో చెప్పలేమని నెహ్రా చెప్పుకొచ్చాడు. ఓవైపు గంభీర్ వన్డే వరల్డ్‌కప్ కోసం రోహిత్, కోహ్లీలకు తలుపులు తెరుచుకునే ఉంటాయని చెప్తుంటే.. నెహ్రా మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అప్పటివరకూ (వన్డే వరల్డ్‌కప్) ఆ ఇద్దరూ రాణించగలిగితే.. ఇది నిజంగా గొప్ప విషయమని వ్యాఖ్యానించాడు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 25 , 2024 | 06:13 PM