AUS vs PAK: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇలాంటి ఆట పాక్‌కే సాధ్యం
ABN, Publish Date - Nov 08 , 2024 | 03:13 PM
వరల్డ్ క్రికెట్‌లో టాప్ టీమ్స్‌లో ఒకటిగా ఆధిపత్యం చెలాయిస్తోంది ఆస్ట్రేలియా. ఫార్మాట్ ఏదైనా ఆ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థులు వణుకుతారు. అలాంటి కంగారూలకు పాకిస్థాన్ బిగ్ షాక్ ఇచ్చింది.
AUS vs PAK: దాయాది పాకిస్థాన్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ అంతుపట్టదు. పసికూనల చేతుల్లో చిత్తుగా ఓడటం, టాప్ టీమ్స్‌కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడం లాంటి వింత వ్యవహారాలు ఆ జట్టుకు మాత్రమే సాధ్యం. బాగా ఆడుతుందుని భావించినప్పుడు చెత్తగా పెర్ఫార్మ్ చేయడం, ఏమాత్రం అంచనాలు లేనప్పుడు బరిలోకి దిగి ప్రత్యర్థిని చిత్తు చేయడం పాక్‌కే చెల్లు. అందుకే వరల్డ్ క్రికెట్‌లో ఏ టీమ్‌నైనా అంచనా వేయొచ్చు.. కానీ దాయాది విషయంలో మాత్రం ఇది వర్కౌట్ కాదు. ఇది మరోమారు నిరూపితమైంది. గత కొన్నాళ్లుగా వరుస అపజయాలతో పరువు తీసుకుంటున్న పాకిస్థాన్.. ఊహించని విధంగా ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది.
చేతులెత్తేసిన బ్యాటర్లు
ఆసీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఓడిన ఆ జట్టు.. కొద్దిలో విక్టరీ మిస్ అయింది. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి తప్పులకు తావివ్వకుండా ఆడింది రిజ్వాన్ సేన. ఏకంగా 9 వికెట్లతో ఆథిత్య జట్టును మట్టికరిపించింది. ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 35 ఓవర్లలో 163 పరుగులకే చాప చుట్టేసింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (35) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హ్యారిస్ రౌఫ్ (5/29) నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల పనిపట్టాడు.
రౌఫ్ దెబ్బకు కుదేలు
బుల్లెట్ పేస్‌తో ఆసీస్ బ్యాటర్లను ఊపిరి ఆడనివ్వకుండా చేశాడు రౌఫ్. పర్ఫెక్ట్ లెంగ్త్, బ్యాటర్లకు తగ్గట్లు లైన్‌లో స్వల్ప మార్పులు చేసుకుంటూ పోయాడు. వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లు పెవిలియన్‌కు పంపించాడు. అతడికి తోడు మరో స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిదీ (3/26) కూడా అదరగొట్టడంతో కంగారూ ఇన్నింగ్స్ రెండొందల లోపే ముగిసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. 26.3 ఓవర్లలోనే 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సయీమ్ ఆయూబ్ (82), అబ్దుల్లా షఫీక్ (64 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అపోజిషన్ టీమ్‌కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. ఆఖర్లో బాబర్ ఆజమ్ (15 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.
Also Read:
టీమిండియాకు కపిల్ దేవ్ కీలక సలహా
సౌతాఫ్రికాతో తొలి టీ20.. భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
కావాలనే సచిన్ కాళ్లు మొక్కించారు.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
For More Sports And Telugu News
Updated Date - Nov 08 , 2024 | 03:16 PM