Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును సమం చేసిన బాబర్ అజామ్
ABN, Publish Date - Jan 17 , 2024 | 03:54 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ సమం చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యర్థిపై అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్లుగా కోహ్లీ, బాబర్ మొదటి స్థానంలో నిలిచారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ సమం చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యర్థిపై అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్లుగా కోహ్లీ, బాబర్ మొదటి స్థానంలో నిలిచారు. న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ ప్రపంచ రికార్డును బాబర్ అజామ్ సమం చేశాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 బంతుల్లో 58 పరుగులు చేశాడు.
టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై బాబర్ అజామ్‌కు ఇది 8వ 50+ స్కోర్ కావడం గమనార్హం. పొట్టి ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌తో పోరులో 18 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన బాబర్.. 7 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. కాగా ఆస్ట్రేలియాపై కింగ్ విరాట్ కోహ్లీ 8 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. కోహ్లీ 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కు అందుకున్నాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో ఒక ప్రత్యర్థిపై అత్యధికసార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతం కోహ్లీ-బాబర్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత శ్రీలంకపై 7 సార్లు 50+ స్కోర్లు సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆరేసి సార్లు 50+ స్కోర్లు సాధించిన విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ మరో ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. కోహ్లీ వెస్టిండీస్‌పై 6 సార్లు 50+ స్కోర్లు సాధించగా.. రిజ్వాన్ ఇంగ్లండ్‌పై సాధించాడు. ఈ జాబితాలో టాప్ 3లో కోహ్లీ రెండుసార్లు ఉండడం గమనార్హం. కాగా న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఫేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి 3 టీ20ల్లో ఓడిన పాకిస్థాన్ సిరీస్‌ను కోల్పోయింది. పాక్ కీలక బ్యాటర్ బాబర్ అజామ్ మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికీ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా మూడు టీ20ల్లో బాబర్ 57, 66, 58 పరుగులతో రాణించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 17 , 2024 | 04:07 PM