IND vs ENG: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. సెంచరీ హీరో రిటైర్డ్ హర్ట్
ABN, Publish Date - Feb 17 , 2024 | 04:59 PM
మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ జోరుగా కొనసాగుతున్న సమయంలో ఇంకొంచెం సేపు అయితే మూడో రోజు ఆట ముగుస్తుందనే సమయంలో యశస్వీ జైస్వాల్ గాయపడ్డాడు.
రాజ్‌కోట్: మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ జోరుగా కొనసాగుతున్న సమయంలో ఇంకొంచెం సేపు అయితే మూడో రోజు ఆట ముగుస్తుందనే సమయంలో యశస్వీ జైస్వాల్ గాయపడ్డాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన జైస్వాల్ ఆ తర్వాత వెన్నునొప్పితో బాధపడ్డాడు. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినప్పటికీ క్రీజులో కుదురుకున్నాక రెచ్చిపోయాడు. వన్డే స్టైలులో బ్యాటింగ్ చేసి 9 ఫోర్లు, 5 సిక్సులతో 122 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 104 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా వెన్నునొప్పి రావడంతో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగా తాజాగా జైస్వాల్ కూడా తప్పుకోవడంతో ఇది టీమిండియాకు ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. కాగా జైస్వాల్‌కు తోడుగా శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ప్రస్తుతం ఇంగ్లండ్‌పై టీమిండియా 300 పరుగులకుపైగా ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్ 191/1గా ఉంది. దీంతో ఇంగ్లండ్ ముందు భారత జట్టు భారీ లక్ష్యాన్ని ఉంచే అవకాశాలున్నాయి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది.
Updated Date - Feb 17 , 2024 | 05:35 PM