IND vs ENG: ధోని 330 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్న రికార్డును 121 ఇన్నింగ్స్‌ల్లోనే కొట్టేసిన రోహిత్ శర్మ
ABN, Publish Date - Feb 15 , 2024 | 04:48 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. సెంచరీతో దుమ్ములేపాడు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను సెంచరీతో ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిపాడు.
రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. సెంచరీతో దుమ్ములేపాడు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను సెంచరీతో ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిపాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 196 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 14 ఫోర్లు, 3 సిక్సులతో 131 పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో టీమిండియా తరఫున సెంచరీ చేసిన అత్యధిక వయసు గల కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ క్రమంలో లోకల్ బాయ్ రవీంద్ర జడేజాతో కలిసి నాలుగో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తానాడిన ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్, సౌరవ్ గంగూలీ ఆల్‌టైమ్ రికార్డులను రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ రికార్డును హిట్‌మ్యాన్ అధిగమించాడు. సౌరవ్ గంగూలీ 18,575 పరుగులు చేయగా.. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 18,641 పరుగులు ఉన్నాయి.
అయితే ఇందుకు సౌరవ్ గంగూలీ 424 మ్యాచ్‌లు ఆడగా.. రోహిత్ శర్మ 470 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 34,357 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 26,733 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రెండో స్థానంలో, 24,208 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్ మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును కూడా రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా 211 సిక్సులు కొట్టిన ధోని రికార్డును 212 సిక్సులతో రోహిత్ అధిగమించాడు. ధోని 330 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కు అందుకోగా రోహిత్ 121 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోవడం గమనార్హం. అలాగే ఈ ఇన్నింగ్స్‌లో కొట్టిన 3 సిక్సుల ద్వారా టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత బ్యాటర్ల జాబితాలో మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలుకొట్టాడు. ధోని 78 సిక్సులు కొట్టగా.. రోహిత్ 80 సిక్సులతో మహీని అధిగమించాడు. దీంతో టీమిండియా తరఫున అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ రెండో స్థానానికి చేరుకున్నాడు. మొత్తంగా ఈ జాబితాలో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సులతో మొదటి స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 15 , 2024 | 04:48 PM