IND vs ENG: చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే..
ABN, Publish Date - Feb 15 , 2024 | 04:40 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆడుతున్నది మొదటి మ్యాచే అయినప్పటికీ ఏ మాత్రం భయం లేకుండా వన్డే స్టైలులో బ్యాటింగ్ చేశాడు.
రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆడుతున్నది మొదటి మ్యాచే అయినప్పటికీ ఏ మాత్రం భయం లేకుండా వన్డే స్టైలులో బ్యాటింగ్ చేశాడు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచే ధాటిగా బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. వరుస ఓవర్లలో యశస్వీ జైస్వాల్(10), శుభ్‌మన్ గిల్‌ను ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన గిల్ ఈ సారి డకౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, లోకల్ బాయ్ రవీంద్ర జడేజా ఆదుకున్నారు. తొలి సెషన్‌లో వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. రెండో సెషన్‌లో రోహిత్ శర్మ సెంచరీ, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో చెలరేగారు. టెస్టు కెరీర్‌లో హిట్‌మ్యాన్‌కు ఇది 11వ సెంచరీ. ఈ క్రమంలో వీరి భాగస్వామ్యం కూడా 100 పరుగులు దాటింది. దీంతో రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌కు ఒక వికెట్ కూడా దక్కలేదు.
మూడో సెషన్‌లో రోహిత్, జడేజాల భాగస్వామ్యం 200 దాటింది. ఇలాంటి సమయంలో సెంచరీ హిరో రోహిత్ శర్మను మార్కు వుడ్ ఔట్ చేశాడు. దీంతో 204 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 196 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 14 ఫోర్లు, 3 సిక్సులతో 131 పరుగులు చేశాడు. మొత్తంగా 237 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. వన్డే స్టైలులో చెలరేగాడు. జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించాడు. అయితే 82వ ఓవర్లో సర్ఫారాజ్ ఖాన్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. దీంతో 314 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 66 బంతుల్లోనే సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు చేశాడు.
Updated Date - Feb 15 , 2024 | 05:35 PM