Marnus Labuschagne: టీమిండియాను రెచ్చగొట్టిన లబుషేన్.. మళ్లీ నోరెత్తకుండా ఇచ్చిపడేశారు
ABN, Publish Date - Nov 22 , 2024 | 04:05 PM
Marnus Labuschagne: స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరైన కంగారూలు మరోమారు తమ వక్రబుద్ధి చూపించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం వచ్చిన టీమిండియాను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ జట్టుకు బుమ్రా సేన గట్టిగా ఇచ్చిపడేసింది.
IND vs AUS: స్లెడ్జింగ్ అంటే చాలా జట్లు భయపడతాయి. కానీ దీన్ని అస్త్రంగా చేసుకొని ఎదిగిన టీమ్‌గా ఆస్ట్రేలియాను చెప్పొచ్చు. అలాగని అదే బలంగా ఇక్కడ వరకు రాలేదు. పదునైన బౌలింగ్, అద్భుతమైన బ్యాటింగ్ ఆ టీమ్ సొంతం. అయితే స్లెడ్జింగ్ ఆసీస్‌కు అదనపు బలంగా మారిందని చెప్పొచ్చు. ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టి వాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసి మ్యాచ్‌లో ఆధిపత్యం సాధించడం కంగారూలకు వెన్నతో పెట్టిన విద్య. దాన్నే మరోమారు ఉపయోగించింది ఆసీస్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం తమ దేశానికి వచ్చిన టీమిండియాను స్లెడ్జింగ్‌తో రెచ్చగొట్టాలని చూసింది. కానీ భారత్ దిమ్మతిరిగేలా ఇచ్చిపడేయడంతో సైలెంట్ అయిపోయింది.
వాళ్లే లక్ష్యంగా..
పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో పేసర్ల డామినేషన్ నడుస్తోంది. ఫస్ట్ డే మొత్తంగా 17 వికెట్లు నేలకూలాయి. దీన్ని పక్కనబెడితే.. తొలి రోజు ఆటలో కంగారూ బ్యాటర్ మార్నస్ లబుషేన్-మహ్మద్ సిరాజ్ మధ్య జరిగిన ఓ ఘటన మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. తన కళ్ల ముందే ఆసీస్ బ్యాటర్లంతా వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతుండటంతో లబుషేన్ తట్టుకోలేకపోయాడు. భారత బౌలర్ల ఏకాగ్రతను దెబ్బతీయాలని భావించాడు. ఈ క్రమంలోనే అరంగేట్ర సీమర్ హర్షిత్ రాణాను కవ్వించాడు. అతడి ట్రేడ్ మార్క్ ఫ్లయింగ్ కిస్‌ను అనుకరించాడు. ముద్దు పెడుతున్నట్లు పోజు ఇచ్చి రెచ్చగొట్టాడు.
కళ్లలోకి కళ్లు పెట్టి..
హర్షిత్‌తో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా లబుషేన్ గెలికాడు. అయితే సిరాజ్ మియా ఊరుకోలేదు. అతడి పైకి దూసుకెళ్లాడు. ఏం అన్నావంటూ కళ్లలోకి కళ్లు పెట్టి ఉరిమేలా చూశాడు. దీంతో లబుషేన్ వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత అతడ్ని టార్గెట్ చేసుకొని భారత బౌలర్లు బౌలింగ్ చేశాడు. గట్టిగా బిగించేసరికి రన్ తీయాలంటే ఆసీస్ బ్యాటర్ వణికిపోయాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న లబుషేన్ 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. సిరాజ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఇది యంగ్ ఇండియా అని, రెచ్చగొడితే వదలరని కామెంట్స్ చేస్తున్నారు. స్లెడ్జింగ్ చేస్తే పోయిస్తారని.. భారత్ జోలికి వస్తే మామూలుగా ఉండదని చెబుతున్నారు. కాగా, తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులతో ఉంది. టీమిండియా స్కోరుకు ఇంకా 83 పరుగుల దూరంలో ఉంది.
Also Read:
వరల్డ్ కప్ హీరోను వణికించిన హర్షిత్ రాణా.. ఏం బౌలింగ్ భయ్యా
జూ. సెహ్వాగ్ ‘డబుల్’
టీఓఏ ఎన్నికల ఫలితాలపై ప్రతిష్ఠంభన
For More Sports And Telugu News
Updated Date - Nov 22 , 2024 | 04:10 PM