IND vs ENG: దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్.. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే..
ABN, Publish Date - Feb 23 , 2024 | 03:55 PM
టీమిండియాతో మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ చెలరేగుతున్నాడు. 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను ఆదుకోవడమే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో జట్టును మంచి స్థితిలో నిలిపాడు.
రాంచీ: టీమిండియాతో మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ చెలరేగుతున్నాడు. 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను ఆదుకోవడమే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో జట్టును మంచి స్థితిలో నిలిపాడు. జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ముఖ్యంగా ఫోక్స్‌తో కలిసి నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ కష్టాల నుంచి తేరుకుంది. ఈ క్రమంలో రూట్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రూట్‌కు ఇది 61వ హాఫ్ సెంచరీ. మొత్తంగా 91వ 50+ స్కోర్ కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో గతంలో 90 సార్లు 50+స్కోర్లు సాధించిన ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ అలిస్టర్ కుక్ రికార్డును రూట్ బద్దలుకొట్టాడు. కుక్ 161 టెస్టుల్లో 90 సార్లు 50+ స్కోర్లు సాధించగా.. 139 టెస్టుల్లో ఆ రికార్డును రూట్ అధిగమించడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్ ముందు వరకు రూట్ పెదగా ఫామ్‌లో లేడు. కానీ తాజా ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు సానుకూలంశంగా చెప్పుకోవచ్చు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆటలో టీ విరామ సమయానికి 198/5 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(67), బెన్ ఫోక్స్ (28) ఉన్నారు. 37 ఓవర్లపాటు సాగిన రెండో సెషన్‌లో 86 పరుగులురాగా ఒక వికెట్ పడింది. అంతకుముందు తొలి సెషన్‌లో ఇంగ్లండ్ టాపార్డర్‌ను టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ వణికించాడు. వెంటవెంటనే 3 వికెట్లు తీయడంతో 57 పరుగులకే ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్‌లో బెన్ డకెట్(11), ఒల్లీ పోప్(0)ను పెవిలియన్ చేర్చిన ఆకాష్ దీప్.. 12వ ఓవర్లో ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న జాక్ క్రాలే(42)ను ఔట్ చేశాడు. ఈ సమయంలో రూట్, బెయిర్‌స్టో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ స్కోర్ 100 దాటింది. అయితే ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న బెయిర్‌స్టోను(38)ను 22వ ఓవర్‌లో అశ్విన్ లెగ్‌బైస్‌లో ఔట్ చేశాడు. దీంతో తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయింది.
రెండో సెషన్ మొదటి ఓవర్లోనే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(3)ను రవీంద్ర జడేజా సింగిల్ డిజిట్‌కే ఔట్ చేశాడు. దీంతో 112 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌ను వెటరన్ బ్యాటర్ జోరూట్, బెన్ ఫోక్స్ ఆదుకున్నారు. ఇంగ్లండ్ బాజ్‌బాల్ వ్యూహానికి విరుద్ధంగా నిదానంగా ఆడిన వీరిద్దరు వికెట్లకు అడ్డుగోడలా నిలిచారు. దీంతోరెండో సెషన్‌లో భారత బౌలర్లు పరుగులు కట్టడి చేసినప్పటికీ మరో వికెట్ సాధించలేకపోయారు. ఈ క్రమంలో రూట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో రూట్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. రూట్, ఫోక్స్ కలిసి ఆరో వికెట్‌కు 113 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీబ్రేక్ అనంతరం మొదలైన మూడో సెషన్ ఆరంభంలోనే హాఫ్ సెంచరీని చేరువ అవుతున్న ఫోక్స్(47)ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో రూట్, ఫోక్స్ భాగస్వామ్యాన్ని తెరపడింది. 225 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 23 , 2024 | 03:58 PM