Watch: రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న షమీ
ABN, Publish Date - Jan 09 , 2024 | 12:26 PM
Mohammed Shami: భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్నాడు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డును అందుకున్నాడు.
ఢిల్లీ: భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్నాడు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డును అందుకున్నాడు. దీంతో ఈ సారి క్రికెట్ నుంచి అర్జున అవార్డు అందుకున్న ఏకైక ఆటగాడిగా షమీ నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో షమీ అద్భుత ప్రదర్శన చేయడంతో బీసీసీఐ అతడి పేరును అర్జున అవార్డుకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
అర్జున అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన షమీ ఇది ఒక కలగా అభివర్ణించాడు. ‘‘అర్జున అవార్డు అందుకోవడం ఒక కల. చాలామందికి వారి జీవిత కాలం మొత్తంలో కూడా ఈ అవార్డు దక్కదు. అలాంటిది నాకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.‘‘ అని అవార్డుల ప్రదానోత్సవానికి ముందు షమీ చెప్పాడు. కాగా షమీతోపాటు మొత్తంగా 26 మంది క్రీడాకారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డులను అందుకున్నారు.
మహ్మద్ షమీ(క్రికెట్), అదితి గోపీచంద్ స్వామి(ఆర్చరీ), ఓజస్ ప్రవీణ్ డియోటలే (ఆర్చరీ), శ్రీశంకర్ మురళి (అథ్లెటిక్స్), పారల్ చౌదరీ (అథ్లెటిక్స్), మహమ్మద్ హుసాముద్దీన్(బాక్సింగ్), ఆర్ వైశాలి(చదరంగం), అనుష్ అగర్వాలా (గుర్రపుస్వారీ), దివ్యాకృతి సింగ్(ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్), దీక్షా దాగర్(గోల్ఫ్), కృష్ణ బహదూర్ పాఠక్(హాకీ), పుఖ్రంబం సుశీల చాను (హాకీ), పవన్ కుమార్(కబడ్డీ), రీతు నేగి(కబడ్డీ), నస్రీన్ (కో-కో), మిస్ పింకీ(లాన్ బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఈషా సింగ్(షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్), అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్(రెజ్లింగ్), యాంటీమ్ పంఘల్(రెజ్లింగ్), శ్రీమతి నౌరెమ్ రోషిబినా దేవి(వుషు), శీతల్ దేవి (పారా అర్చరీ), ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), శ్రీమతి ప్రాచీ యాదవ్(పారా కనోయింగ్) అర్జున అవార్డులను అందుకున్నారు.
Updated Date - Jan 09 , 2024 | 12:26 PM