T20 World Cup: నో డౌట్.. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌దే గెలుపు
ABN, Publish Date - Jun 26 , 2024 | 09:38 PM
టీ20 వరల్డ్‌కప్‌లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రని కొనసాగించిన భారత జట్టు.. టైటిల్‌ని సొంతం చేసుకోవడానికి మరో రెండు అడుగుల దూరంలోనే ఉంది. అందునా..
టీ20 వరల్డ్‌కప్‌లోని (T20 World Cup) గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రని కొనసాగించిన భారత జట్టు.. టైటిల్‌ని సొంతం చేసుకోవడానికి మరో రెండు అడుగుల దూరంలోనే ఉంది. అందునా.. ఇంగ్లండ్‌తో జరగబోయే సెమీ ఫైనల్ పోరు అతిపెద్ద గండంగా మారింది. 2022లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో భారత్ దూకుడుకి ఇంగ్లండ్ చెక్ పెట్టింది కాబట్టి.. అదే భయం ఇప్పుడు వెంటాడుతోంది. ఇలాంటి తరుణంలో.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పాల్ కాలింగ్‌వుడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. గతంలో మాదిరిగా భారత్ ఈసారి ఓడిపోదని, కచ్ఛితంగా గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచాడు.
‘‘నిజం చెప్పాలంటే.. ఈసారి భారత జట్టు ఓడిపోతుందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడున్న భారత జట్టు ఎంతో గొప్పగా, ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా.. జస్‌ప్రీత్ బుమ్రా అయితే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతను ఫిట్‌గా ఉండటమే కాదు.. ఎంతో కచ్చితత్వంతో, నైఫుణ్యంతో బంతులను సంధిస్తున్నాడు. అతని బంతులను ఎలా ఎదుర్కోవాలనే సమాధానం ఏ జట్టు వద్ద కూడా లేదు. ఈ టీ20 ఫార్మాట్‌లో బుమ్రా వేసే 24 బంతులు ఎంతో ప్రభావం చూపుతాయి. ఇక అమెరికాలాంటి క్లిష్టమైన పిచ్‌లలో కూడా భారత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడింది. రోహిత్ శర్మ అయితే ఆసీస్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ భారత జట్టుని ఓడించాలంటే.. అసాధారణ రీతిలో ఇంగ్లండ్ పోరాడాల్సి ఉంటుంది’’ అని కాలింగ్‌వుడ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఫ్లాట్ పిచ్‌లలో అయితే ఇంగ్లండ్ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందని, స్లో-పిచ్‌లు మాత్రం భారత్‌కు అనుకూలంగా ఉంటాయని కాలింగ్‌వుడ్ అభిప్రాయపడ్డాడు. ఈ రెండు జట్ల మధ్య జరగబోయే సెమీ ఫైనల్ పోరులో గయానా పిచ్ ఎంతో కీలకంగా మారనుందని పేర్కొన్నాడు. గతంలో పోలిస్తే ప్రస్తుతం టీమిండియా విధానం మారిందని.. వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో వ్యూహాలు పనిచేయవని వాళ్లు అర్థం చేసుకున్నారని చెప్పాడు. రిస్క్ తీసుకొని ధైర్యంగా ముందుకు సాగితేనే సాధించగలమన్నాడు. ఈ మెంటాలిటీ విపలమైతే విమర్శలు రావొచ్చు కానీ.. వరల్డ్‌కప్ గెలవాలంటే మాత్రం ఇతర జట్లు అవలంభించే విధానాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సిందేనని సూచించాడు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 26 , 2024 | 09:38 PM