Ravindra Jadeja: మామ ఆరోపణలపై రివాబా జడేజాను ప్రశ్నించిన మీడియా.. ఆమె సమాధానం ఇదే!
ABN, Publish Date - Feb 12 , 2024 | 11:50 AM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కుటుంబ విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జడేజాకు రివాబాతో వివాహం అయినప్పటి నుంచి తమ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని చెప్పుకొచ్చాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కుటుంబ విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇందుకు రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సిన్హా చేసిన వ్యాఖ్యలే కారణం. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జడేజాకు రివాబాతో వివాహం అయినప్పటి నుంచి తమ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని చెప్పుకొచ్చాడు. తమ కుటుంబంలో నెలకొన్న సమస్యలన్నింటికీ రవీంద్ర జడేజా భార్య రివాబానే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ తన కొడుకును ఎంతో కష్టపడి క్రికెటర్‌ను చేశానని చెప్పాడు. కానీ ప్రస్తుతం తన కొడుకును కలిసే అవకాశం కూడా లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లైన రెండు మూడు నెలలకే జడేజా ఆస్తులన్నింటిని తన పేరు మీదికి మార్చాలని రివాబా డిమాండ్ చేసిందని, వేరు కాపురం పెట్టిందని చెప్పాడు. తమ మనవరాలని కనీసం ఒకసారి కూడా చూడనివ్వలేదని ఆరోపించాడు.
ఈ క్రమంలో తన కొడుకును క్రికెటర్‌ను చేయకపోయి ఉంటే బాగుండేదని, అప్పుడు రివాబా తమ జీవితాల్లోకి వచ్చేది కాదని అన్నాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజాతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. తాము వారికి ఫోన్ చేయమని, వారు తమకు ఫోన్ చేయరని అనిరుధ్ సిన్హా చెప్పాడు. అయితే తన తండ్రి ఆరోపణలను రవీంద్ర జడేజా ఖండించాడు. సదరు ఇంటర్యూ ముందస్తు ప్రణాళికతో చేసినదని, తన భార్య ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఇలా చేశారని మండిపడ్డాడు. ఇరువర్గాలను సంప్రదించిన తర్వాతే ఇటువంటి వార్తలు ప్రసారం చేస్తే బాగుంటుందని అన్నాడు. అయితే మామ ఆరోపణలపై రవీంద్ర జడేజా భార్య, జామ్ నగర్ ఎమ్మెల్యే రివాబాకు ప్రశ్న ఎదురైంది. ఓ కార్యక్రమానికి హాజరైన రివాబాను ఈ మేరకు మీడియా ప్రశ్నించగా ఆమె స్పందించడానికి ఆసక్తి కనబర్చలేదు. ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో తెలియదా అని అన్నారు. వ్యక్తిగత విషయాల గురించి అడగాలంటే తనను నేరుగా సంప్రదించాలని, అంతేకానీ ఇక్కడ ఆ విషయాల గురించి మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జడేజా, రివాబాకు 2016లో వివాహం అయింది. వారికి ఓ కూతురు కూడా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 12 , 2024 | 11:50 AM