RCB vs LSG: డికాక్ విధ్వంసం.. పూరన్ మెరుపులు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?
ABN, Publish Date - Apr 02 , 2024 | 09:23 PM
క్వింటాన్ డికాక్ విధ్వంసానికి తోడు నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ డికాక్(81) హాఫ్ సెంచరీతో చెలరేగడానికి తోడు డెత్ ఓవర్లలో పూరన్ (40) మెరుపులు మెరిపించాడు.
బెంగళూరు: క్వింటాన్ డికాక్ (Quinton de Kock) విధ్వంసానికి తోడు నికోలస్ పూరన్(Nicholas Pooran) మెరుపులు మెరిపించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ డికాక్(81) హాఫ్ సెంచరీతో చెలరేగడానికి తోడు డెత్ ఓవర్లలో పూరన్ (40) మెరుపులు మెరిపించాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన బెంగళూరు స్పిన్నర్ మాక్స్‌వెల్(2/23) కీలక భాగస్వామ్యాలను విడదీశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోసూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు క్వింటాన్ డికాక్, కేఎల్ రాహుల్ శుభారంభాన్ని అందించారు. డికాక్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. టాప్లీ వేసిన మొదటి ఓవర్‌లోనే 3 బౌండరీలు బాదాడు. సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో డికాక్ 2 సిక్సులు బాదాడు. ఈ క్రమంలో డికాక్, రాహుల్ కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని ఆరో ఓవర్లో స్పిన్నర్ మ్యాక్స్‌వెల్ విడదీశాడు. 2 సిక్సులతో 14 బంతుల్లో 20 పరుగులు చేసిన రాహుల్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 53 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది.
కాసేపటి తర్వాతి దేవదత్ పడిక్కల్(6)ను మహ్మద్ సిరాజ్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేర్చాడు. దీంతో 73 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం మయాంక్ దగర్ వేసిన 12వ ఓవర్‌లో క్వింటాన్ డికాక్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో డికాక్‌కు ఇది 22వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో స్టోయినీస్‌తో కలిసి డికాక్ జట్టు స్కోర్‌ను 100 పరుగులు దాటించడమే కాకుండా మూడో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో డికాక్ తన ఐపీఎల్ కెరీర్‌లో 3 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 13వ ఓవర్‌లో డికాక్ ఓ సిక్సు, ఫోర్.. స్టోయినీస్ ఓ సిక్సు బాదడంతో 19 పరుగులొచ్చాయి. మరోసారి చెలరేగిన స్పిన్నర్ మాక్స్‌వెల్ ఈ భాగస్వామ్యాన్ని కూడా విడదీశాడు. ఒక ఫోర్, 2 సిక్సులతో 15 బంతుల్లో 24 పరుగులు చేసిన స్టోయినీస్‌ను 14వ ఓవర్‌లో ఔట్ చేశాడు.
ఆ కాసేపటికే హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న డికాక్‌ను 17వ ఓవర్‌లో పేసర్ టాప్లీ ఔట్ చేశాడు. దీంతో 143 పరుగులకు లక్నో 4 వికెట్లు కోల్పోయింది. 56 బంతులు ఎదుర్కొన్న డికాక్ 8 ఫోర్లు, 5 సిక్సులతో 81 పరుగులు చేశాడు. ఆయుష్ బదోనిని యష్ దయాల్ డకౌట్ చేశాడు. దీంతో 148 పరుగులకు లక్నో సగం వికెట్లు కోల్పోయింది. టాప్లీ వేసిన 19వ ఓవర్‌లో పూరన్ మూడు భారీ సిక్సులు బాదాడు. ఆ ఓవర్ మొత్తంలో 20 పరుగులొచ్చాయి. సిరాజ్ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులొచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లో లక్నోసూపర్ జెయింట్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఒక ఫోర్, 5 సిక్సులతో 21 బంతుల్లో 40 పరుగులు చేసిన పూరన్ నాటౌట్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో మాక్స్‌వెల్ 2, సిరాజ్, యష్ దయాల్, టాప్లీ తలో వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..
MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..
Updated Date - Apr 02 , 2024 | 09:40 PM