India vs Sri Lanka: శ్రీలంక టూర్‌కి ఆ ముగ్గురు దూరం.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికంటే?
ABN, Publish Date - Jul 09 , 2024 | 04:15 PM
ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో ఉన్న భారత జట్టు.. అది ముగించుకున్న తర్వాత శ్రీలంకకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆథిత్య జట్టుతో భారత్ ఆగస్టులో మూడు మ్యాచ్‌ల వన్డే, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు..
ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో ఉన్న భారత జట్టు.. అది ముగించుకున్న తర్వాత శ్రీలంకకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆథిత్య జట్టుతో భారత్ ఆగస్టులో మూడు మ్యాచ్‌ల వన్డే, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడనుంది. అయితే.. ఈ టూర్‌కి ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నారని వార్తలొస్తున్నాయి. వారే.. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah). రోహిత్, కోహ్లీ ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. శ్రీలంక వన్డే సిరీస్‌కి కూడా తమకు విశ్రాంతి కావాలని ఆ ఇద్దరితో పాటు బుమ్రా కోరడంతో.. బీసీసీఐ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
విశ్రాంతికి కారణం ఇదే!
ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘‘శ్రీలంకతో ఆగస్టులో జరగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రాబోయే షెడ్యూల్‌ని దృష్టిలో పెట్టుకుని.. వారికి రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ముగ్గురు తిరిగి సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌ల్లో తిరిగి చేరుతారు’’ అని పేర్కొన్నారు. ముఖ్యంగా.. రోహిత్, కోహ్లీ టెస్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు మొత్తం 10 టెస్టు మ్యాచ్‌లో ఉండనున్నాయని.. ఆ పదింటిలోనూ వాళ్లిద్దరు ఉంటారని స్పష్టం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఉంటుందని.. వన్డే ప్రాక్టీస్‌కి ఆ మూడు మ్యాచ్‌లు ఆ ఇద్దరికి సరిపోతాయని వెల్లడించారు. కాగా.. కొంతకాలం నుంచి విరామం లేకుండా రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతుండటం వల్లే.. తమకు విశ్రాంతి కావాలని ఆ ముగ్గురు అడిగినట్లు తెలిసింది.
కెప్టెన్ ఎవరు?
ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. శ్రీలంక టూర్‌కి వెళ్లే భారత జట్టుకి కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి ఇస్తారు? అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya).. ఇప్పటికే కెప్టెన్సీ రేసులో ఉన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్ సమయంలో అతడినే వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. గతంలో రోహిత్ లేని టైంలోనూ భారత జట్టుని సమర్థవంతంగా నడిపించాడు. కాబట్టి.. హార్దిక్‌కే నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అతను కాకపోతే.. కేఎల్ రాహుల్ (KL Rahul) కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 09 , 2024 | 04:15 PM