Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ఆ ముగ్గురితో సమంగా..
ABN, Publish Date - Jul 31 , 2024 | 02:42 PM
టీమిండియా (టీ20) కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో..
టీమిండియా (టీ20) కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇంతకుముందే ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులతో బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడు సూర్యతో వారితో సమంగా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుపొందిన తర్వాత అతను ఈ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (7) అగ్రస్థానంలో ఉన్నాడు.
మూడు మ్యాచ్‌ల్లోనూ కీలక పాత్ర
ఆ సిరీస్‌లో సూర్య అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం అందరికీ తెలిసిందే. మూడు మ్యాచ్‌ల్లో అతను 92 పరుగులు చేయడంతో పాటు బంతితోనూ మాయ చేశాడు. మూడో టీ20లో ఒక ఓవర్ వేసిన అతను.. కేవలం ఐదు పరుగులే ఇచ్చి, రెండు కీలకమైన వికెట్లను పడగొట్టాడు. ఇలా బ్యాట్‌తో పాటు బంతితోనూ మ్యాజిక్ చేసి, మూడు విజయాల్లోనూ కీలక పాత్ర పోషించినందుకు గాను సూర్యకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. కాగా.. సూర్యకు ఫుల్ టైం కెప్టెన్‌గా ఇది మొట్టమొదటి సిరీస్. తొలి సిరీస్‌లోనే ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేసి.. సూర్య తన చరిష్మా చాటాడు. అటు.. ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు కూడా ఇది మొదటి సిరీస్. జట్టులో మార్పులు చేసి ఇప్పటికే తనదైన ముద్ర వేసిన అతను, ఈ విజయంతోనూ సక్సెస్‌ఫుల్ కోచ్‌గా పేరుగాంచాడు.
మూడో మ్యాచ్‌లో సూపర్ విక్టరీ
ఇక మూడో మ్యాచ్ విషయానికొస్తే.. సూపర్ ఓవర్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. శుభ్‌మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), వాషింగ్టన్ సుందర్ (25) పుణ్యమా అని.. భారత్ ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. ఇక లక్ష్య ఛేధనలో భాగంగా.. శ్రీలంక కూడా అన్నే పరుగులు చేసింది. నిజానికి.. లంక ఆడిన తీరు చూసి, ఆ జట్టే విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. చివర్లో రింకూ సింగ్, సూర్య అద్భుతంగా బౌలింగ్ వేసి.. భారత జట్టుని ఓటమి నుంచి గట్టెక్కించారు. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో సుందర్ బంతిని తిప్పేసి, రెండు వికెట్లు తీసి.. భారత్ గెలుపుకు బాటలు వేశాడు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 31 , 2024 | 02:42 PM