IND vs AUS: టీమిండియా బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు
ABN, Publish Date - Dec 09 , 2024 | 12:21 PM
IND vs AUS: అడిలైడ్ టెస్ట్‌లో దారుణ పరాభవాన్ని రుచి చూసింది టీమిండియా. పెర్త్ టెస్ట్‌లో మాదిరిగానే ఆడి ఉంటే ఎంచక్కా సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లేవాళ్లు. కానీ బ్లండర్ మిస్టేక్‌తో మ్యాచ్‌ను కంగారూలకు అప్పనంగా ఇచ్చేశారు మెన్ ఇన్ బ్లూ.
Team India: అడిలైడ్ టెస్ట్‌లో దారుణ పరాభవాన్ని రుచి చూసింది టీమిండియా. పెర్త్ టెస్ట్‌లో మాదిరిగానే ఆడి ఉంటే ఎంచక్కా సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లేవాళ్లం. కానీ బ్లండర్ మిస్టేక్‌తో మ్యాచ్‌ను కంగారూలకు అప్పనంగా ఇచ్చేశారు మెన్ ఇన్ బ్లూ. పింక్ బాల్ టెస్ట్‌ను డిసైడ్ చేసిన మెయిన్ ఫ్యాక్టర్ అంటే ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. అనూహ్యమైన బౌన్స్, స్వింగ్ లభిస్తున్న కఠినమైన పిచ్‌పై అతడు ఆడిన నాక్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అయితే అతడి విషయంలో మన బౌలర్లు, కెప్టెన్‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. హెడ్‌ను ఆరంభంలోనే గట్టిగా బిగించి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. కానీ అతడ్ని ఆపలేకపోయింది టీమిండియా. అయితే తెలిసి తప్పు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వీక్‌నెస్ తెలిసినా..
ప్రతి ఆటగాడికి ఒక బలహీనత ఉంటుంది. అలాగే ట్రావిస్ హెడ్‌కు కూడా ఓ వీక్‌నెస్ ఉంది. ఒకటి కాదు.. అతడికి రెండు బలహీనతలు ఉన్నాయి. అందులో ఒకటి షార్ట్ బాల్స్ ఆడటంలో ఉన్న ఇబ్బంది. మరొకటి యార్కర్లను సరిగ్గా ఎదుర్కోలేకపోవడం. ఆఫ్ సైడ్ షాట్స్ కొట్టి దొరికిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడు చాలా మటుకు ఇలాంటి బంతులకే ఔట్ అవుతూ వస్తున్నాడు. అడిలైడ్ టెస్ట్‌లోనూ ఇదే రీతిలో ఔట్ అయ్యాడు హెడ్. మహ్మద్ సిరాజ్ వేసిన స్టన్నింగ్ యార్కర్‌కు అతడు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే అప్పటికే ఆలస్యమైంది. 140 పరుగుల బిగ్ ఇన్నింగ్స్‌తో కంగారూలు మ్యాచ్‌లో పట్టుబిగించేలా చేసేశాడు.
అప్పనంగా ఇచ్చేశారు
హెడ్ వీక్‌నెస్ ఏంటో భారత టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు బాగా తెలుసు. కానీ అతడ్ని ఆపలేకపోయారు. షార్ట్ బాల్స్ గానీ యార్కర్లు గానీ సరైన లెంగ్త్‌లో వేసి అతడ్ని ఇబ్బంది పెట్టలేదు. దీంతో అతడు చెలరేగిపోయాడు. ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘హెడ్ 140 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడికి కేవలం 4 కచ్చితమైన బౌన్సర్లు మాత్రమే వేశారు భారత బౌలర్లు. ఆఫ్ సైడ్ ఏరియాలో బంతులు వేస్తూ అతడ్ని నియంత్రించేందుకు ప్రయత్నించలేదు. లెగ్ సైడ్ బాల్స్ విసురుతూ యథేచ్ఛగా రన్స్ కొట్టనిచ్చారు. ఆఫ్ సైడ్ బ్లాక్ చేయడంతో పాటు బాడీని టార్గెట్ చేసుకొని బౌన్సర్లు వేయాల్సింది’ అని భజ్జీ స్పష్టం చేశాడు. ఎలా పడితే అలా బౌలింగ్ చేస్తే వికెట్లు రావని.. వీక్‌నెస్ మీద కొడితేనే వస్తాయన్నాడు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని దుయ్యబట్టాడు హర్భజన్.
Also Read:
తప్పంతా హెడ్‌దే.. ఓవరాక్షన్ చేస్తున్నాడు: సిరాజ్
రెచ్చగొడితే ఊరుకోవాలా.. బరాబర్ తిడతాం అంటున్న రోహిత్
పీకల మీదకు తెచ్చుకున్న గంభీర్.. అంతా స్వయంకృతమే
For Sports And Telugu News
Updated Date - Dec 09 , 2024 | 12:29 PM