Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు
ABN, Publish Date - May 19 , 2024 | 09:58 AM
విరాట్ కోహ్లీ.. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఇప్పటివరకూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో హేమాహేమీలు సాధించిన ఎన్నో ఘనతల్ని బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్‌మార్క్‌లను..
విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఇప్పటివరకూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో హేమాహేమీలు సాధించిన ఎన్నో ఘనతల్ని బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించాడు. ఎవ్వరికీ సాధ్యం కాని మరెన్నో ఘనతల్ని తన సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో (Indian Premiere League) ఏ భారతీయ ఆటగాడికి సాధ్యం కాని మరో చారిత్రాత్మక రికార్డును ఈ రన్ మెషీన్ నమోదు చేశాడు.
స్మృతి ఇరానీపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు.. గత ఐదేళ్లలో..
ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 64.36 సగటుతో మొత్తం 708 పరుగులు చేశాడు. దీంతో.. రెండు ఐపీఎల్ సీజన్లలో 700+ స్కోర్లు చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు 2016 సీజన్‌లో 973 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఓవరాల్‌గా మాత్రం కోహ్లీ ఈ ఫీట్‌ని సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ కన్నా ముందు క్రిస్ గేల్ రెండుసార్లు 700+ స్కోర్లు చేశాడు. 2012లో 733 పరుగులు చేసిన ఆ వెస్టిండీస్ ఆటగాడు, ఆ తదుపరి సీజన్‌లోనూ (2013) అదే దూకుడు కొనసాగించి 708 పరుగులు చేశాడు.
ఆర్సీబీ హీరో అతడే.. శభాష్ అంటూ ప్రశంసలు
ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. పాఫ్ డు ప్లెసిస్ (54) అర్థశతకంతో రాణించడంతో పాటు కోహ్లీ (47), రజత్ (41), గ్రీన్ (38) మెరుపులు మెరిపించడం వల్లే ఆర్సీబీ అంత భారీ స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. సీఎస్కే 7 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితం కావడంతో, ఓటమిపాలైంది. మొదట్లో రచిన్ రవీంద్ర (61) దుమ్ముదులిపేయగా.. చివర్లో జడేజా (42 నాటౌట్), ధోనీ (23) గట్టిగానే పోరాడారు కానీ.. చివరికి ఫలితం లేకుండా పోయింది.
కోహ్లీ సాధించిన మరిన్ని రికార్డులు
* ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 708 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్ 155.60. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్ట్రైక్‌రేట్.
* 2016లో 973 పరుగులు చేసిన కోహ్లీ.. ఇప్పటికీ ఒక సీజన్‌లో హయ్యస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
* లీగ్ దశ ముగిసే సమయానికి కోహ్లీ 37 సిక్సులు కొట్టి.. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.
* భారత్ వేదికగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కోహ్లీనే. సీఎస్కేపై ఇన్నింగ్స్‌తో 9000+ స్కోరును దాటేశాడు.
Read latest Sports News and Telugu News
Updated Date - May 19 , 2024 | 09:58 AM