Share News

India vs Zimbabwe: తేలిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి

ABN , Publish Date - Jul 06 , 2024 | 08:26 PM

ఎన్నో అంచనాలు పెట్టుకున్న యువ ఆటగాళ్లు పెద్ద హ్యాండ్ ఇచ్చేశారు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.

India vs Zimbabwe: తేలిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి
India vs Zimbabwe

ఎన్నో అంచనాలు పెట్టుకున్న యువ ఆటగాళ్లు పెద్ద హ్యాండ్ ఇచ్చేశారు. జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వేతో ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ (Team India) ఘోర పరాజయం చవిచూసింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 116 లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. 102 పరుగులకే జెండా ఎత్తేసింది. దీంతో.. 13 పరుగుల తేడాతో జింబాబ్వే గెలుపొందింది.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడం వల్లే.. అంత తక్కువ స్కోరుకే ఆతిథ్య జట్టు దుకాణం ఎత్తేసింది. ముఖ్యంగా.. రవి బిష్ణోయ్ (4 వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ వేసి, జింబాబ్వే బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. భారత జట్టు పేకమేడలా కుప్పకూలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) (31), వాషింగ్టన్ సుందర్ (27 నాటౌట్) మాత్రమే పోరాటపటిమ కనబరిచారు. మిగతా ఆటగాళ్లందరూ విఫలమయ్యారు. విధ్వంసకర ఆటగాళ్లుగా పేరొందిన అభిషేక్ శర్మ, రింకూ సింగ్ డకౌట్లుగా వెనుదిరిగారు.


ఇక రుతురాజ్ (7), రియాన్ పరాగ్ (2), ధృవ్ జురేల్ (6) లాంటి సమర్థవంతమైన బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. చివర్లో పేసర్ అవేశ్ ఖాన్ కాస్త ఝలక్ ఇచ్చాడు. 12 బంతుల్లో మూడు ఫోర్ల సహకారంతో 16 పరుగులు చేసి.. జట్టుని ట్రాక్‌లోకి తీసుకురావాలని ప్రయత్నించాడు. అవేశ్, సుందర్ కలిసి.. జట్టుని విజయతీరాలకి చేర్చాలని తమవంతు కృషి చేశారు కానీ.. వారి ప్రయత్నం విఫలమైంది. ఐపీఎల్‌లో సత్తా చాటిన వాళ్లందరూ ఈ మ్యాచ్‌లో ఫెయిల్ అవ్వడంతో.. భారత్ 19.5 ఓవర్లలో భారత్ 102 పరుగులకు కుప్పకూలింది. దీంతో.. 13 పరుగులతో జింబాబ్వే విజయఢంకా మోగించింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 08:26 PM