IPL Trophy 2024 : గంభీర’ విజయం
ABN, Publish Date - May 27 , 2024 | 04:59 AM
వావ్..ఏం ఆట! టోర్నమెంట్ ఆరంభం నుంచే అదిరే ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ ఫైట్‌వరకూ అదేజోరు కొనసాగించింది. ఫలితంగా ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ
వావ్..ఏం ఆట! టోర్నమెంట్ ఆరంభం నుంచే అదిరే ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ ఫైట్‌వరకూ అదేజోరు కొనసాగించింది. ఫలితంగా ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. గత ఏడాది నితీష్ రాణా కెప్టెన్సీలో బరిలో దిగిన కేకేఆర్ దారుణంగా విఫలమైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో సీజన్‌ను పేలవంగా ముగించింది. కానీ ఏడాదికాలంలోనే ఆ జట్టు ఆట తీరు ఎంత అనూహ్యంగా మారిపోయింది. అందుకు ప్రధాన కారణం..జట్టు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీరే అని చెప్పాలి. గౌతీ సారథ్యంలోనే 2012, 2014లో నైట్‌రైడర్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. దాంతో గంభీర్ శక్తి సామర్థ్యాలు తెలిసిన కోల్‌కతా యజమాని షారుఖ్ ఖాన్ అతడిని మెంటార్‌గా మరో ఆలోచన లేకుండా నియమించాడు. తనపై ఉంచిన నమ్మకానికి వంద శాతం న్యాయం చేస్తూ జట్టును చాంపియన్‌గా తీర్చిదిద్దాడు గంభీర్. మార్గదర్శకుడిగా బాధ్యతలు చేపట్టగానే జట్టు వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయమై గౌతీ దృష్టి నిలిపాడు. ఈక్రమంలో ఒక్కో ఆటగాడిగా అతడి కర్తవ్యాలను నిర్దేశించాడు. ముఖ్యంగా ఓపెనర్‌గా సునీల్ నరైన్‌ను పంపడం గౌతమ్ తీసుకొన్న అతి కీలక నిర్ణయం. నిరుటి ఐపీఎల్‌లో వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన నరైన్ అట్టర్ ఫ్లాపయ్యాడు. కానీ ఓపెనర్‌గా పంపుతూ గంభీర్ తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నిరూపిస్తూ ధనాధన్ బ్యాటింగ్‌తో నరైన్ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో గుబులు రేపాడు.
నరైన్‌కు జతగా ఫిల్ సాల్ట్‌ను ఓపెనర్‌గా పంపడం కూడా సూపర్ హిట్టయ్యింది. మిడిలార్డర్‌లో వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్, రమణ్‌దీప్..రాణించడం కోల్‌కతాను తిరుగులేని జట్టుగా నిలిపింది. బౌలింగ్ విభాగంలో..స్పిన్నర్ నరైన్ తురుపుముక్కగా పని చేశాడు. అతడికి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అండగా నిలవడంతో ప్రత్యర్థి బ్యాటర్లు విలవిల్లాడారు. వెస్టిండీ్‌సకు చెందిన మరో ఆల్‌రౌండర్ రస్సెల్‌ను బౌలర్‌గా కెప్టెన్ శ్రేయాస్ ఉపయోగించుకున్న తీరు కూడా గంభీర్ మార్గదర్శనమే. ఎంతో ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేసిన రస్సెల్ ఎలాంటి వికెట్లు సాధించాడో చూశాం. పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ వికెట్ల వేటలో పోడీపడ్డారు. సన్‌రైజర్స్‌తో కీలకమైన క్వాలిఫయర్-1లో (3వికెట్లు) తనలోని బౌలింగ్ వీరుడిని మేల్కొల్పిన స్టార్క్ ఫైనల్లోనూ చెలరేగాడు. సన్‌రైజర్స్‌తో ఫైనల్లో కోల్‌కతా బౌలింగ్ విభాగం చేసిన ప్రదర్శన అద్భు తం. మొత్తంగా ప్రతీ ఆటగాడూ తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని తు.చ. తప్పకుండా ఆచరించడం కోల్‌కతా విజయానికి దోహదం చేసింది.
Updated Date - May 27 , 2024 | 04:59 AM