ఒకే ఒక్క త్రో...
ABN , Publish Date - Aug 07 , 2024 | 03:40 AM
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా తాజా ఒలింపిక్స్‌ను ఘనంగా ఆరంభించాడు. మంగళవారం స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరిగిన పురుషుల జావెలిన్‌త్రో క్వాలిఫయింగ్‌లో తను తొలి ప్రయత్నంలోనే 89.34మీ. దూరం విసిరి ఫైనల్‌కు...
జావెలిన్‌త్రోలో ఫైనల్‌కు నీరజ్
తొలి ప్రయత్నంలోనే 89.34మీ. దూరం
కిశోర్ జెనా విఫలం
వచ్చాడు.. వచ్చేశాడు. ఎవరు ఏ పతకం గెలిచినా.. గెలవకపోయినా స్వర్ణం ఖాయమన్న అంచనాలున్న ఏకైక భారత అథ్లెట్ నీరజ్ చోప్రా. ఇసుమంతైనా ఆ నమ్మకాన్ని తగ్గించకుండా క్వాలిఫయింగ్‌లో ఈ స్టార్ జావెలిన్ త్రోయర్ తొలి ప్రయత్నంలోనే వావ్.. అనిపించాడు. మిగతా ప్లేయర్లు కిందా మీదా పడుతుంటే, ఊపిరి బిగపట్టి విసిరిన త్రోకు అతడి జావెలిన్.. రాకెట్ వేగంతో అలా.. అలా దూసుకెళ్లి 89.34మీ. దూరం వెళ్లి పడింది. తద్వారా నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించి అభిమానులను ఆనందడోలికల్లో ముంచాడు. గుర్తుందా.. టోక్యో గేమ్స్‌లో అతడు 87.58మీ. దూరంతోనే గోల్డ్ కొట్టేశాడు. మరో భారత అథ్లెట్ కిశోర్ జెనా మాత్రం నిరాశపర్చాడు.
పారిస్: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా తాజా ఒలింపిక్స్‌ను ఘనంగా ఆరంభించాడు. మంగళవారం స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరిగిన పురుషుల జావెలిన్‌త్రో క్వాలిఫయింగ్‌లో తను తొలి ప్రయత్నంలోనే 89.34మీ. దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. నీరజ్ కెరీర్‌లో ఇది రెండో బెస్ట్ త్రో. అలాగే క్వాలిఫికేషన్ రెండు గ్రూపుల్లో 32 మంది త్రోయర్లు పాల్గొనగా నీరజ్‌దే టాప్ షో. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే అథ్లెట్లు జావెలిన్‌ను కనీసం 84మీ. దూరం విసరాల్సి ఉంటుంది. నీరజ్ మొదటి ప్రయత్నంలోనే అంతకుమించి వేయడంతో మిగిలిన రెండు చాన్స్‌లను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకపోయింది. మరోవైపు టాప్-12 మంది అథ్లెట్ల మధ్య జరిగే ఫైనల్ గురువారం రాత్రి 11.55కు ఆరంభమవుతుంది. వాస్తవానికి నీరజ్ ఈ ఏడాది బెస్ట్ 88.36మీ. (దోహా డైమండ్ లీగ్‌లో) దూరమే అయినా ఒలింపిక్స్ క్వాలిఫికేషన్‌లో మాత్రం దాన్ని సునాయాసంగా అధిగమించాడు. ఇక రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన గ్రెనెడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ (88.63మీ.), పాక్‌కు చెందిన అర్షద్ నదీమ్ (86.59మీ.) కూడా గ్రూప్ ‘ఎ’లో నీరజ్‌తో పాటు తొలి ప్రయత్నంలోనే బెర్త్ దక్కించుకున్నారు. బ్రెజిల్ త్రోయర్ డా సిల్వా లూయిజ్ (85.91మీ) మాత్రం మూడో ప్రయత్నంలో అర్హత సాధించాడు. ఇదిలావుండగా గ్రూప్ ‘ఎ’లో బరిలోకి దిగిన మరో భారత త్రోయర్ కిశోర్ జెనా మాత్రం తొమ్మిదో స్థానంతో నిరాశపర్చాడు. అతడు తొలి ప్రయత్నంలో 80.73మీ., మూడో ప్రయత్నంలో 80.21మీ. విసరగా.. రెండో ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు.