Virat Kohli: నా నెక్స్ట్ గోల్ అదే.. దాని కోసమే పోరాటం: కోహ్లీ
ABN, Publish Date - Nov 01 , 2024 | 09:49 AM
ఐపీఎల్ రిటెన్షన్ గురించి కింగ్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మళ్లీ తనను తీసుకోవడంపై ఉద్వేగానికి గురయ్యాడు. వచ్చే మూడేళ్లలో కచ్చితంగా జట్టుకు కప్పు అందిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. బెంగళూర్ అభిమానులు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు.
ఊహించిందే జరిగింది. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ మొత్తం వెచ్చించింది. కళ్లు చెదిరే ధరకు అతడ్ని రిటెయిన్ చేసుకుంది. గత సీజన్ వరకు సారథిగా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్‌ను తీసుకోని ఆర్సీబీ.. యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్, పేసర్ యశ్ దయాల్ ను మాత్రం రీటెయిన్ చేసుకుంది. పాటిదార్ కోసం రూ.11 కోట్లు, యశ్ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసిన బెంగళూరు.. కింగ్ కోహ్లీ కోసం ఏకంగా రూ.21 కోట్లు వెచ్చించడం విశేషం. ఈ నేపథ్యంలో విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తదుపరి లక్ష్యం ఏంటో క్లారిటీ ఇచ్చాడు. ఇక మీదట తన పోరాటం దాని కోసమే అని స్పష్టం చేశాడు. అసలు కోహ్లీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
నా కల అదే..
‘ఆర్సీబీ మళ్లీ నన్ను రీటెయిన్ చేసుకోవడం సంతోషంగా ఉంది. నెక్స్ట్ సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. వచ్చే మూడేళ్లలో కనీసం ఒక్కసారైనా ఐపీఎల్ కప్పును అందుకోవాలనేది మా గోల్. అందుకోసం మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ, అండగా నిలబడుతున్న అభిమానులను గర్వించేలా చేస్తాం’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ ఐపీఎల్ సైకిల్ ముగిసేసరికి ఆర్సీబీతో తన ప్రయాణం 20 ఏళ్లకు చేరుకుంటుందన్నాడు. రెండు దశాబ్దాల పాటు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని కింగ్ వ్యాఖ్యానించాడు. ఇదే అతిపెద్ద గౌరవమని విరాట్ పేర్కొన్నాడు.
మళ్లీ కెప్టెన్సీ
ఆర్సీబీ తనకు ఎంత ముఖ్యమనేది అందరికీ తెలుసునని కోహ్లీ చెప్పాడు. ఏళ్లు గడిచే కొద్దీ ఆ ఫ్రాంచైజీతో తన అనుబంధం మరింత బలోపేతం అవుతూ వస్తోందన్నాడు. బెంగళూరు తనకు చాలా ప్రత్యేకమని చెప్పిన కింగ్.. అక్కడి అభిమానులతో తనకు స్పెషల్ బాండింగ్ ఉందన్నాడు. ఇక, గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్న డుప్లెసిస్‌ను రీటెయిన్ చేసుకోకపోవడంతో కోహ్లీనే మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి:
India vs New Zealand: మొదలైన ముంబై టెస్ట్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
Updated Date - Nov 01 , 2024 | 10:16 AM