Share News

Vinesh Phogat : వినేశ్‌ విలాపం

ABN , Publish Date - Aug 08 , 2024 | 05:36 AM

ఒలింపిక్స్‌ ముగింపు దశకు వస్తున్నా ఒక్క స్వర్ణ పతకమూ లేదని 140 కోట్ల మంది భారతీయులు ఆవేదన చెందుతున్న తరుణం..అలాంటి సమయంలో అంచనాలను నిలబెట్టుకొంటూ, తన సత్తా, పోరాట పటిమను చాటిచెబుతూ పసిడి పతక పోరుకు దూసుకొచ్చింది..దేశ ప్రజానీకంలో ఆనందోత్సాహలు నింపింది..వారు

 Vinesh Phogat : వినేశ్‌  విలాపం

రెజ్లర్‌పై అనర్హత వేటు

పతకానికి దూరం

నిర్దేశిత బరువుకంటే 100 గ్రా. అదనం

రాత్రంతా తీవ్రంగా శ్రమించినా తగ్గని వైనం

ఒలింపిక్స్‌ ముగింపు దశకు వస్తున్నా ఒక్క స్వర్ణ పతకమూ లేదని 140 కోట్ల మంది భారతీయులు ఆవేదన చెందుతున్న తరుణం..అలాంటి సమయంలో అంచనాలను నిలబెట్టుకొంటూ, తన సత్తా, పోరాట పటిమను చాటిచెబుతూ పసిడి పతక పోరుకు దూసుకొచ్చింది..దేశ ప్రజానీకంలో ఆనందోత్సాహలు నింపింది..వారు గర్వంగా తలెత్తుకొనేలా చేసింది..మరికొద్ది గంటల్లో జరిగే తుది పోరులో కూడా సివంగిలా విజృంభించడం ద్వారా ఈసారి విశ్వక్రీడల్లో స్వర్ణ బోణీ కొడుతుందని దేశ ప్రజలు సంబరపడుతున్న వేళ ఊహించని పరిణామం..100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ అనర్హతకు గురైంది. ఈ హఠాత్పరిణామంతో భారతావని మ్రాన్పడిపోయింది..అంతులేని వేదనలో కూరుకు పోయింది..ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహా దేశం..దేశం..వినేశ్‌ ఫొగట్‌కు అండగా నిలిచింది..మరోవైపు రెండు కేజీల బరువు తగ్గేందుకు ఆహారం తీసుకోకుండా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు తీవ్ర వ్యాయామాలతో శ్రమించినా వినేశ్‌కు ఫలితం దక్కలేదు. పైగా అతి వ్యాయామంతో డీహైడ్రేషన్‌కు లోనైన వినేశ్‌ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది..క్రీడా గ్రామంలోని పాలీ క్లినిక్‌లో చేరిన ఫొగట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం చీఫ్‌ పీటీ ఉష కలిసి పరామర్శించింది..

పారిస్‌: రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ పసిడి పతక పోరుకోసం భారతావని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఫైనల్లోనూ ఆమె అద్భుతంగా రాణించి స్వర్ణ పతకం గెలవాలని ప్రార్థించింది. కొద్ది గంటల్లో జరగబోయే మహిళల 50 కిలోల ఫైనల్‌ బౌట్‌కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్న సమయంలో బుధవారం మధ్యాహ్నం పిడుగులాంటి వార్త వచ్చింది. నిర్ణీత బరువుకంటే వినేశ్‌ 100 గ్రాములు అదనంగా ఉందని, దాంతో నిబంధనల ప్రకారం నిర్వాహకులు ఆమెపై వేటు వేశారనేది ఆ వార్త. దరిమిలా దేశం మొత్తం షాక్‌కు లోనైంది. బంగారు పతకంతో సగర్వంగా తిరిగొస్తుందని ఆశించిన ప్రజలకు ఆమె రిక్తహస్తాలతో వెనక్కు వస్తోందన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

ఎందుకిలా..

ప్రపంచ రెజ్లింగ్‌ పాలక మండలి..యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం..పోటీకి ముందు ప్రతి రెజ్లర్‌ బరువును పరిశీలిస్తారు. దానిని ‘వే ఇన్‌’ అంటారు. పోటీ రోజు ఉదయం.. పాల్గొనే రెజ్లర్లందరికీ వైద్య పరీక్షలతోపాటు వే ఇన్‌ నిర్వహిస్తారు. ఈ వే ఇన్‌ సందర్భంగా ఒక్కో రెజ్లర్‌కు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఆలోపు ఎన్నిసార్లయినా బరువును పరీక్షించుకోవచ్చు. రెండోరోజు మాత్రం..ఫైనల్స్‌కు, రెపిచేజ్‌ రౌండ్‌కు అర్హత సాధించిన రెజ్లర్లకే వే ఇన్‌ ఉంటుంది. రెండోరోజు వే ఇన్‌ గడువు 15 నిమిషాలు. మొదటిరోజు కానీ, రెండోరోజుకానీ రెజ్లర్‌ ఎవరైనా వే ఇన్‌కు హాజరుకాకపోతే వారిని పోటీనుంచి బహిష్కరిస్తారు. వారికి చివరి ర్యాంకింగ్‌ ఇస్తారు.

బరువు తగ్గేందుకు..

రెండు రోజులపాటు బరువును పరిశీలించనున్న నేపథ్యంలో నిర్దేశిత బరువును కొనసాగించడం రెజ్లర్లకు కత్తిమీదసామే. ఒకవేళ బరువు పెరిగినా దానిని తగ్గించడమూ వారికి సవాలే. బరువు తగ్గడంకోసం ఆహారం మానేస్తారు. నీరు ఎక్కువగా తీసుకోరు. జిమ్‌లలో తీవ్రంగా శ్రమిస్తారు. ఇంకా..ఆవిరి స్నానం చేయడం, జుత్తు కత్తిరించుకోవడం వంటి విధానాలనూ ఆచరిస్తారు. వాస్తవానికి..50 కిలోల విభాగం వినేశ్‌ రెగ్యులర్‌గా పోటీపడేది కాదు. ఆమెది 53 కేజీల కేటగిరీ. కానీ ఈ విభాగంలో ఒలింపిక్‌ బెర్త్‌ను అంతిమ్‌ ఫంగల్‌ దక్కించుకొంది. ఫలితంగా వినేశ్‌ ఫొగట్‌ 50 కిలోల విభాగానికి మారాల్సి వచ్చింది.

అందుకే బరువు పెరిగింది

పోటీల తర్వాత నిర్దేశిత బరువుకంటే వినేశ్‌ 2.7 కిలోలు అదనంగా బరువున్నట్టు గుర్తించాం. సాధారణంగా బరువును తగ్గించేందుకు చాలా సమయం పడుతుంది. కానీ మాకు 12 గంటల సమయమే మిగిలింది. వెంటనే కోచ్‌, సహాయ బృందం అన్ని చర్యలు తీసుకుంది’ అని పారి్‌సలో భారత బృందం చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. దిన్షా పార్దీవాలా వివరించారు. ‘రాత్రికి రాత్రి రెండు కేజీల బరువు తగ్గడం ఆషామాషీకాదు. బరువు తగ్గించే చర్యలు శక్తి కోల్పోయేలా చేస్తాయి. బౌట్లలో పాల్గొన్న తర్వాత బరువు ఒక్కసారిగా పెరిగే అవకాశాలుంటాయి’ అని పార్థీవాలా తెలిపారు. ‘వినేశ్‌ విషయంలో ఒక్కసారి బరువు తగ్గడం మరీ..మరీ..కష్టం. ఎందుకంటే ఆమె సహజ శరీర బరువు 56-57 కిలోలు’ అని ఆయన గుర్తు చేశారు.

గతంలో ఇలా జరిగిందా ?

ఒలింపిక్స్‌, ఆసియా క్రీడలు, ఆసియా, వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో ఏ రెజ్లర్‌కైనా నిర్దేశిత బరువుకంటే ఒక్క గ్రాము కన్సెషన్‌ కూడా ఇవ్వరు. కానీ ర్యాంకింగ్‌, ఇన్విటేషనల్‌ ఈవెంట్లకు మాత్రం రెండు కేజీల వరకు మినహాయింపు ఉంటుంది. ఇక..2016 రియో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ సందర్భంగా వినేశ్‌ 400 గ్రాములు అధికంగా ఉండడంతో అప్పుడూ ఆమెపై వేటు పడింది.

జుత్తు కత్తిరించుకున్నా..

మంగళవారం జరిగిన తొలి బౌట్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ యు యి సుసాకిపై సంచలన విజయం సాధించిన వినేశ్‌..ఆపై క్వార్టర్స్‌, సెమీ్‌సలోనూ గెలుపొంది పసిడి పతక పోరులో అడుగుపెట్టింది. తొలిరోజు..అంటే మంగళవారం బౌట్లకు ముందు ఆమె 49.9 కిలోలు ఉందని సమాచారం. మూడు బౌట్లతో నీరసించిన ఆమె కొద్దిపాటి ఆహారం తీసుకుంది. సెమీస్‌ మ్యాచ్‌ పూర్తయ్యాక వినేశ్‌ 52.7 కిలోలు ఉందట. దాంతో సెమీఫైనల్‌ కాగానే వినేశ్‌ స్కిప్పింగ్‌ చేస్తున్న దృశ్యాలు ఎక్స్‌లో వైరల్‌ అయ్యాయి. అలాగే జాగింగ్‌, సైక్లింగ్‌, ఆవిరి స్నానం కూడా చేసింది. అంతేకాదు.. ఆహారం తీసుకోకుండా, మంచినీరు తాగకుండా మంగళవారం రాత్రంతా మేల్కొనే ఉంది. ఇంకా జుత్తు కూడా కత్తిరించుకుంది. శరీరంలో కొంత రక్తం కూడా తీయించుకున్నదట. అయితే ఇంతగా కష్టపడినా..బుధవారం ఉదయం వే ఇన్‌కు వెళ్లినప్పుడు ఆమె నిర్ణీత 50 కేజీలకంటే 100 గ్రాముల అదనంగా ఉంది. దరిమిలా వినేశ్‌పై అనర్హత వేటు పడింది.

ఆసుపత్రిలో వినేశ్‌

డిహైడ్రేషన్‌ వల్ల వినేశ్‌ స్పృహ కోల్పోవడంతో బుధవారంనాడు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. క్రీడా గ్రామంలోని పాలీ క్లినిక్‌లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. భారత బృందం డాక్టర్‌ పార్థీవాలా, వినేశ్‌ కోచ్‌, ఇతర సహాయ సిబ్బంది ఆమెతో ఉన్నారు. చికిత్స పొందుతున్న వినేశ్‌ను ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష కలిసి పరామర్శించింది. ఆమెను అనునయించడంతోపాటు ధైర్యం చెప్పింది.

ఉషకు ప్రధాని మోదీ సూచన

వినేశ్‌ డిస్‌క్వాలిఫై అయ్యిందని తెలియగానే... ఐఓఏ చీఫ్‌ పీటీ ఉషతో ప్రధాని మోదీ మాట్లాడారు. వినేశ్‌పై వేటుకు సంబంధించి ఐవోసీ ముందు రివ్యూకు అప్పీల్‌ చేయాలని సూచించారు. ఆమేరకు బలమైన వాదనలు వినిపించాలని కూడా ఉషను ప్రధాని ఆదేశించారు.

కుట్ర జరిగిందా?

వినేశ్‌పై వేటు వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ..అతడిని బహిష్కరించాలనే డిమాండ్‌తో దేశ రెజ్లర్లంతా ఏడాదికిపైగా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి వినేశ్‌తోపాటు ఇతర స్టార్‌ రెజ్లర్లు బజ్‌రంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌ నేతృత్వం వహించారు. తీవ్ర స్థాయికి చేరిన ఆ ఉద్యమం పార్లమెంట్‌ ముట్టడికి దారి తీయడం..ఆ క్రమంలో వినేశ్‌ సహా ఇతర రెజ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు వేసింది. రెజ్లర్ల ఆందోళన ఫలితంగా డబ్ల్యూఎఫ్‌ఐకి బ్రిజ్‌భూషణ్‌ రాజీనామా చేయక తప్పలేదు. అలాగే..బ్రిజ్‌భూషణ్‌ తదితరులపై కేసులు నమోదై కోర్టు విచారణ వరకు వెళ్లింది. కాగా..డబ్ల్యూఎఫ్‌ఐకి జరిగిన ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్‌ ప్రధాన అనుయాయి సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడం గమనార్హం. సంజయ్‌ సింగ్‌ ఎన్నికపై స్టార్‌ రెజ్లర్లంతా ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నారంటారు. మొత్తంగా రెజ్లర్ల ఆందోళన దేశ క్రీడా రంగంలో ప్రకంపనలు సృష్టించింది. నాటి ఆందోళనతో రెజ్లింగ్‌ సమాఖ్య అప్పటి పెద్దలు, ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఈనేపథ్యంలో..కీలకమైన ఒలింపిక్స్‌ 50 కి. ఫైనల్‌ బౌట్‌కు ముందు వినేశ్‌ ఫొగట్‌పై వేటు పడడం చర్చకు దారి తీసింది. నాటి ఆందోళనను జీర్ణించుకోలేని సమాఖ్య పెద్దలు కొందరు..ఫొగట్‌ డిస్‌క్వాలిఫికేషన్‌ వెనుక ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని సహాయ సిబ్బందితో వినేశ్‌కు ఇవ్వడం ద్వారా ఆమె బరువు పెరిగేలా కుట్ర పన్నారని వారు ఆరోపిస్తున్నారు. దిగ్గజ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ కూడా కుట్రకోణం ఉందనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ‘మన రెజ్లర్లపై ఇది పెద్ద కుట్ర. 100 గ్రాముల బరువు తగ్గేందుకు వినేశ్‌కు మరింత సమయం ఇవ్వాల్సింది. గతం లో ఏ అథ్లెట్‌కు ఇలాంటిది జరగలేదు’ అని విజేందర్‌ ఎక్స్‌లో వ్యాఖ్యానించాడు. ఏమైనా..వినేశ్‌ ఫొగట్‌పై వేట దేశ క్రీడా రంగంలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది.

అలాంటిదేమీ లేదు: వినేశ్‌ డిస్‌క్వాలిఫై అంశంలో కుట్రలేదని భారత అథ్లెటిక్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) స్పష్టంజేసింది. ఈమేరకు వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. అది సాంకేతిక అంశమని, దానిని రాజకీయం చేయొద్దని సమాఖ్య అధ్యక్షుడు సుమరివాలా కోరారు.

గాయంతో వైదొలగితే పతకం వచ్చేదా ?

గాయం కారణం చూపుతూ ఫైనల్‌ బౌట్‌నుంచి వినేశ్‌ వైదొలిగితే కనీసం రజత పతకం లభించేదన్న వాదన వినిపిస్తోంది. యూడబ్లూడబ్ల్యూ నిబంధనలు అందుకు అంగీక రించవు. మొదటి రోజు పోటీ సమయంలో రెజ్లర్‌ గాయపడితే రెండోరోజు వే ఇన్‌కు హాజరు కానవసరంలేదు. అయితే తొలిరోజు పోటీ అనంతరం రెజ్లర్‌ గాయపడినా లేదా అనారోగ్యంతో వాకోవర్‌ ఇవ్వడానికి ముందు కూడా వే ఇన్‌కు రావాల్సిందే. ఇక వినేశ్‌ మొదటిరోజు పోటీ సందర్భంగా గాయపడలేదు. అందువల్ల ఆమె రెండో రోజు వే ఇన్‌కు తప్పక హాజరు కావాల్సిందే.

ఆటలో భాగం వినేశ్‌ వ్యాఖ్య

తన డిస్‌క్వాలిఫికేషన్‌పై వినేశ్‌ ఫొగట్‌ స్పందించింది. ‘పతకాన్ని కోల్పోవడం దురదృష్టకరం. అయితే ఇవన్నీ ఆటల్లో సహజం’ అని తనను కలిసిన రెజ్లింగ్‌ జాతీయ కోచ్‌ వీరేందర్‌ దహియాతో వినేశ్‌ వ్యాఖ్యానించింది. ఆసుపత్రిలో ఉన్న వినేశ్‌ను పలువురు ఐఓసీ అధికారులు కలిసి అనునయించారు.

కోర్టుకు వినేశ్‌.. నేడు తీర్పు ?

తనపై వేసిన అనర్హత వేటును కొట్టివేయాలని క్రీడల మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని (సీఏఎస్‌) వినేశ్‌ ఫొగట్‌ కోరింది. అంతేకాదు తనకు రజత పతకం ప్రకటించాలని కూడా విజ్ఞప్తి చేసింది. కాగా..తన తీర్పు ఇచ్చేందుకు న్యాయస్థానం గురువారం వరకు గడువు కోరినట్టు సమాచారం. న్యాయస్థానం కనుక వినేశ్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే..అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ వినేశ్‌కు సంయుక్తంగా రజత పతకం అందజేయాల్సి ఉంటుంది.

‘వినేశ్‌పై అనర్హత వేటు నిరాశకలిగిస్తోంది. అయినా కోట్లాది మంది భారతీయుల చాంపియన్‌ ఆమెనే’

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


విచారణ జరగాలి: డబ్ల్యూఎఫ్‌ఐ

వినేశ్‌ అనర్హతకు గురవడంలో ఆమె కోచ్‌, సహాయ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ అన్నాడు. ఈ విషయంలో పూర్తిగా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరాడు. ’వినేశ్‌ అదనపు బరువు విషయమై బుధవారం ఉదయం ఫోన్‌ వచ్చింది. ఆమెకు కొంత సమయం, సడలింపు ఇవ్వాలని అధికారులను అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. ఈ విషయంలో వినేశ్‌ తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. మొత్తం బాధ్యతంతా ఆమె కోచ్‌, సహాయక సిబ్బందిపై ఉంది. ఆమె బరువు ఎలా పెరిగిందనే దానిపై విచారణ జరగాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని సంజయ్‌ వ్యాఖ్యానించాడు.

Updated Date - Aug 08 , 2024 | 06:50 AM