Virat Kohli: అరెరె.. కోహ్లీకి ఇలా జరిగిందేంటి.. ఇక్కడ కూడా అతడి డామినేషనేనా..
ABN , Publish Date - Nov 29 , 2024 | 03:03 PM
కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని బీట్ చేస్తూ మరో క్రికెటర్ హిస్టరీ క్రియేట్ చేశాడు. కోహ్లీ పేరిట ఉన్న రికార్డును తన పేరిట చేసుకున్నాడు.. ఇంతకీ ఎవరా క్రికెటర్
ముంబై: ఐపీఎల్ వేలం తర్వాత టీమిండియా క్రికెటర్ల సంపాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన మెగా వేలంలో కుర్ర క్రికెటర్లకు ప్రధాన్యం ఇచ్చిన ఫ్రాంచైజీలు భారీ ప్యాకేజీలతో వారిని కొనుగోలు చేశారు. అయితే, ఇప్పటివరకు భారత క్రికెట్లో అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ పేరు ఉండేది. తాజాగా నంబర్ వన్ స్థానం నుంచి నంబర్ 2 స్థానానికి కింగ్ కోహ్లీ పడిపోయాడు. అతడి స్థానంలో స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వచ్చి చేరాడు. పంత్ ను ఏకంగా రూ. 27 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అతడి తోటి ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ రూ. 26.75, వెంకటేశ్ అయ్యర్ రూ. 23.75 లక్షల వంటి భారీ ధరకు అమ్ముడై టాప్ 3లో నిలిచారు. విరాట్ కోహ్లీని రూ. 21 కోట్లు చెల్లించి ఆర్సీబీ జట్టు అట్టిపెట్టుకుంది.
టాప్‌లో పంత్..
దీంతో ఇప్పుడు ఈ క్రికెటర్లు ఒక్క ఐపీఎల్ మాత్రమే కాకుండా మొత్తంగా ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఇక్కడ కూడా పంత్ డామినేషనే కనపడుతోంది. పంత్ ఏడాదికి మొత్తంగా రూ. 32 కోట్లు సంపాదిస్తుండగా విరాట్ కోహ్లీ సంపాదన రూ. 28 కోట్లుగా ఉంది. ఐపీఎల్ తో పాటు బీసీసీఐ కాంట్రాక్టు ద్వారా కూడా వీరు ఈ మొత్తం అందుకుంటున్నారు. సెంట్రల్ కాంట్రాక్టు ద్వారా పంత్ ఏడాదికి రూ. 5 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఐపీఎల్ ఇతడికి రూ. 27 కోట్లు ముట్టజెప్పనుంది. మొత్తం కలిపి రూ. 32 కోట్లు. మూడు ఫార్మాట్లలోనూ పంత్ ను కీలక ప్లేయర్ గా భావిస్తున్న బీసీసీఐ త్వరలోనే అతడిని ఎ ప్లస్ ఆటగాళ్ల జాబితాలో చేర్చే అవకాశాలున్నాయి.
కోహ్లీకి కోత పడింది అక్కడే..
బీసీసీఐ కాంట్రాక్టు ద్వారా ఎ ప్లస్ క్యాటగిరీ కి చెందిన కోహ్లీ రూ. 7 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆర్సీబీ జట్టు అతడికి రూ. 21 కోట్లు చెల్లించనుంది. మొత్తం రూ. 28 కోట్లు. అయితే, వచ్చే ఏడాది మార్చిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కొత్త ప్రకటన తర్వాత పంత్ సంపాదన మరింత పెరగనుంది. టీ20 స్వ్కాడ్ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో వార్షిక పారితోషకంలోనూ కోత పడింది. ఇక యువ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ వంటి ఆటగాళ్లిద్దరూ సెంట్రల్ కాంట్రాక్టులో భాగం కాదన్న సంగతి తెలిసిందే. దీంతో ఒక వేళ శ్రేయాస్ అయ్యార్ తిరిగి భారత జట్టులో చేరితే అతడు ఈ కాంట్రాక్టులో చేరే అవకాశం ఉంది.