మనీలాండరింగ్ కేసు పేరుతో మహిళను బెదిరించి 43లక్షల దోపిడీ!
ABN, Publish Date - Oct 23 , 2024 | 06:04 AM
ఎవరో వీడియో కాల్ చేసి.. ఏదో దర్యాప్తు సంస్థ పేరు చెప్పి.. కేసులున్నాయని బెదిరిస్తే స్థిమితంగా ఆలోచించాల్సిపోయి ఉన్నత విద్యావంతులూ హడలిపోతున్నారు.
ఉరిశిక్ష తప్పదంటూ ఫోన్‌లో సైబర్ నేరగాళ్ల హెచ్చరిక
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎవరో వీడియో కాల్ చేసి.. ఏదో దర్యాప్తు సంస్థ పేరు చెప్పి.. కేసులున్నాయని బెదిరిస్తే స్థిమితంగా ఆలోచించాల్సిపోయి ఉన్నత విద్యావంతులూ హడలిపోతున్నారు. వారు అడిగినంత మొత్తం ఖాతాలకు బదిలీ చేస్తున్నారు! ఆ తర్వాత గానీ తాము సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డామని తెలుసుకోలేకపోతున్నారు. హైదరాబాద్ వాస్తవ్యురాలు, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న 34 ఏళ్ల మహిళ ఇలానే రూ.43.4 లక్షలు మోసపోయింది. డీసీపీ ధార కవిత వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళకు ట్రాయ్ (టెలీకమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి మాట్లాడుతున్నట్లుగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. మాట్లాడుతూనే ఆమె పేరుతో ఉన్న రెండు ఫోన్ నంబర్లు మరో రెండు గంటల్లో బ్లాక్ చేస్తున్నామంటూ ఫోన్లో ఆ వ్యక్తి హెచ్చరించాడు.
తర్వాత ఆమెపై సైబర్ క్రైమ్‌లో మనీ ల్యాండరింగ్ కేసులు నమోదైనట్లు తమకు సమాచారం అందిందంటూ కాల్‌ను ముంబైలోని అందేరీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశాడు. అక్కడ పోలీసు యూనిఫాంలో ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ.. ఆమెను వెంటనే డిజిటల్ అరెస్టు చేయండంటూ బాధితురాలివైపు కోపంగా చూస్తూ సిబ్బందిని హెచ్చరించాడు. ‘మీ ఫోన్ నంబర్ ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయి. నరేష్ గోయల్‌కు చెందిన రూ. 6.8 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో మీ హస్తం ఉందని, మీ మరో ఫోన్ నంబర్‌పై ఇప్పటికే 17 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మీపై అరెస్టు వారెంట్ జారీ అయింది’ అని బెదిరింపులకు గురిచేస్తూ సుప్రింకోర్టు నుంచి వచ్చిన వారెంట్ లేఖను చూపించాడు. కచ్చితంగా ఉరిశిక్ష తప్పదంటూ బెదిరించారు.
తాను ఏ తప్పూ చేయలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పడంతో మరో అధికారి లైన్‌లోకి వచ్చి, ‘మీరు చెప్తుంటే మీరు ఏ తప్పూ చేయలేదని అర్థం అవుతుంది. కానీ మేం సుప్రీం కోర్టుకు, ఆర్‌బీఐకి సాక్ష్యాధారాలతో మీరు తప్పు చేయలేదని నిరూపించాలి. కాబట్టి మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బంతా ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని ఖాతాకు బదిలీ చేయండి. ఆర్థిక లావాదేవీలు పరిశీలించిన తర్వాత మీరు ఏ తప్పూ చేయలేదని నిర్ధారించి మీ డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తాం’ అని చెప్పాడు. అయితే ఆమె ఖాతాలో సరిపడా డబ్బులేకపోవడంతో.. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొత్తం విత్‌డ్రా చేయించి మొత్తం రూ. 43.4 లక్షలు కొల్లగొట్టారు. మరుసటి రోజు వారికి ఫోన్ చేయాలని చూస్తే కాంటాక్టు కట్ చేశారు. అనుమానం వచ్చిన బాధితురాలు కుటుంబసభ్యుల సహకారంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Oct 23 , 2024 | 06:04 AM