యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:03 AM
యాదాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం(వైటీపీఎస్) నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరగడంతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) నుంచి రూ.7,037 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు జెన్‌కోకు మార్గం సుగమమైంది.
ప్రభుత్వానికి జెన్‌కో ప్రతిపాదన
మంత్రివర్గం ఆమోదం.. త్వరలో ఉత్తర్వులు
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం(వైటీపీఎస్) నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరగడంతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) నుంచి రూ.7,037 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు జెన్‌కోకు మార్గం సుగమమైంది. అదనపు రుణం కోసం జెన్‌కో చేసిన ప్రతిపాదనను శనివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇందుకు సంబంధించిన జీవో త్వరలోనే వెలువడనుంది. ఆ జీవో ఆధారంగా పీఎ్‌ఫసీ నుంచి జెన్‌కో రుణం పొందనుంది. రూ.25,099 కోట్ల అంచనా వ్యయంతో నల్లగొండ జిల్లా దామరచర్లలో 2015-16లో తెలంగాణ జెన్‌కో 4,000 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న వైటీపీఎస్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం క్రమంగా పెరుగుతోంది. తొలుత రూ.29,965 కోట్లకు, అనంతరం రూ.34,543 కోట్లకు ప్రస్తుతం రూ.36,131 కోట్లకు నిర్మాణ అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రభుత్వానికి జెన్‌కో ప్రతిపాదనలు పంపించింది. విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే కర్భన ఉద్గారాలు, కాలుష్యాన్ని తగ్గించడానికి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్(ఎ్‌ఫజీడీ) అనే సాంకెతికతతో అదనపు పనులు చేపట్టాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయడంతో వైటీపీఎస్ నిర్మాణ వ్యయాన్ని తొలిసారి సవరించారు. అనంతరం నిర్మాణంలో జరుగుతున్న జాప్యం, పెట్టుబడి రుణాలపై వడ్డీల భారం పెరుగుతుండడంతో మరో రెండుసార్లు అంచనా వ్యయాన్ని సవరించారు.
మండనున్న విద్యుత్ ధరలు
యాదాద్రి విద్యుత్ కేంద్రంలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు యూనిట్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతమున్న సమాచారం మేరకు నవంబరులో రెండు, డిసెంబరులో ఒక యూనిట్ కలిపి 2,400 మెగా వాట్ల ప్లాంట్ అందుబాటులోకి రానుంది. అయితే, నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ ధరలు భారం కానున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వివిధ ప్లాంట్ల నుంచి సగటును రూ.4.92కు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. యాదాద్రి ప్లాంట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్ ధర యూనిట్‌కు రూ.8.50 వరకు ఉండే అవకాశం ఉంది.
Updated Date - Oct 30 , 2024 | 05:03 AM