Medical Colleges: 72 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి
ABN, Publish Date - Nov 10 , 2024 | 01:48 AM
దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి కొత్తగా 72 నూతన వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేసినట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది.
దక్షిణాది రాష్ట్రాలకు 17.. తెలంగాణకు 8 కాలేజీలు మంజూరు.. వివరాలు వెల్లడించిన ఎన్‌ఎంసీ
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి కొత్తగా 72 నూతన వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేసినట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. కొత్తగా అనుమతులు పొందిన కాలేజీలు, సీట్లు అప్‌గ్రేడేషన్ అయిన కాలేజీలు, సీట్ల వివరాలను ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఉంచింది. 72 కొత్త కాలేజీల్లో 6850 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులివ్వగా మరో 30 కాలేజీల్లో అదనంగా 1872 సీట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 8722 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది. కొత్త కాలేజీల్లో దక్షిణాది రాష్ట్రాలకు 17 మంజూరు కాగా అత్యధిక మెడికల్ కాలేజీలను దక్కించుకుంది తెలంగాణ రాష్ట్రమే.
ఈ విద్యా సంవత్సరానికి ఏకంగా 8 ప్రభుత్వ (యాదాద్రి, మెదక్, గద్వాల, మహేశ్వరం, కుత్భుల్లాపూర్, ములుగు, నారాయణపేట్, నర్సంపేట)ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీకి (నోవా) ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, కర్నాటకలో 3, కేరళలో 1, తమిళనాడులో 3 కాలేజీలకు అనుమతులిచ్చింది. కాగా తెలంగాణ నుంచి మరో రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు అనుమతులు కోసం దరఖాస్తు చేయగా ఎన్‌ఎంసీ వాటిని తిరస్కరించింది. కొత్తగా అనుమతులు పొందిన కాలేజీలతో దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 766కు చేరింది. అలాగే యూజీ మెడికల్ సీట్ల సంఖ్య కూడా 1.15 లక్షలకు చేరింది. ఎన్‌ఎంసీ గణాంకాల మేరకు తెలంగాణలో గతేడాది 56 మెడికల్ కాలేజీలుండగా ఈ ఏడాది వాటి సంఖ్య 65కు చేరింది.
Updated Date - Nov 10 , 2024 | 01:48 AM