TG: నెత్తురోడిన రహదారులు..
ABN, Publish Date - May 18 , 2024 | 03:33 AM
అతి వేగంతో వాహన ప్రయాణం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలో రాంసాన్‌పల్లి శివారులో 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబమే బలైపోయింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తాడ్కూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(35), సునీత(30) దంపతులకు కుమారుడు నగేష్(7) ఉన్నాడు. వీరు ముగ్గురు శుక్రవారం బైక్‌పై తాడ్కూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం
జోగిపేట/చిట్యాల రూరల్/కూసుమంచి, మే 17: అతి వేగంతో వాహన ప్రయాణం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలో రాంసాన్‌పల్లి శివారులో 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబమే బలైపోయింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తాడ్కూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(35), సునీత(30) దంపతులకు కుమారుడు నగేష్(7) ఉన్నాడు. వీరు ముగ్గురు శుక్రవారం బైక్‌పై తాడ్కూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. రాంసాన్‌పల్లి శివారులో వీరి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద గేదెను తప్పించే క్రమంలో ఓ కారు బోల్తా పడింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లు(54) మరణించారు. వెంకటేశ్వర్లు తన అల్లుడు దొడ్డపనేని నర్సింహారావుతో కలిసి ఆస్పత్రి పని నిమిత్తం గురువారం కారులో హైదరాబాద్ వచ్చారు.
గురువారం రాత్రి ఖమ్మంకు తిరుగు ప్రయాణమైన వీరు జీళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఫ్లైఓవర్ దిగగానే ఓ గేదె హఠాత్తుగా అడ్డురాగా డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వెంకటేశ్వర్లు సడన్ బ్రేక్ వేశారు. అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు దీంతో అదుపు తప్పి బోల్తా కొట్టి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు డోరు ఊడిపోగా వెంకటేశ్వర్లు తల డివైడర్‌కు తగలడంతో అక్కడికక్కడే మరణించారు. మరోపక్క, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను బైక్ ఢీకొట్టిన ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేంద్రకుమార్(23), ప్రమోద్ మరణించారు. యూపీకి చెందిన సురేంద్రకుమార్, పంకజ్(20), ప్రమోద్.. చిట్యాల మండలం వెలిమినేడులో నివాసముంటూ భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల శివారులోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నారు. విధులకు వెళ్లేందుకు ముగ్గురూ ఒకే బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో వెలిమినేడు శివారులో సుర్కంటిగూడెం దాటాక రోడ్డుపై నిలిపి ఉన్న ఓ డీసీఎంను ఢీకొని ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో సురేంద్రకుమార్ మరణించగా.. పంకజ్, ప్రమోద్‌ను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ హైదరాబాద్ తరలిస్తుండగా ప్రమోద్ చనిపోయాడు.
Updated Date - May 18 , 2024 | 03:33 AM