చెత్త డంపింగ్‌తో కంపుకొడుతున్న కాలనీ
ABN, Publish Date - Nov 12 , 2024 | 10:24 PM
మంచిర్యాల మున్సిపాలిటీలోని అండాళమ్మ కాలనీ మున్సిపల్ చెత్తతో కంపు కొడుతోంది. రహదారులు, ఇళ్లకు సమీపంలో చెత్త డంప్ చేస్తుండటంతో దుర్వాసనకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డంప్ యార్డును ఎత్తివేయాలని కాలనీవాసులు ఆందోళనలు చేపట్టినప్పటికీ ఫలితం ఉండటంలేదు.
మంచిర్యాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపాలిటీలోని అండాళమ్మ కాలనీ మున్సిపల్ చెత్తతో కంపు కొడుతోంది. రహదారులు, ఇళ్లకు సమీపంలో చెత్త డంప్ చేస్తుండటంతో దుర్వాసనకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డంప్ యార్డును ఎత్తివేయాలని కాలనీవాసులు ఆందోళనలు చేపట్టినప్పటికీ ఫలితం ఉండటంలేదు. ఫలితంగా కాలనీలోని ప్రజలు అనారోగ్యం బారిన పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నివాస గృహాలకు సమీపంలో ఏర్పాటు చేసిన డంప్ యార్డులో పట్టణంలోని 36 వార్డులకు సంబంధించిన చెత్త వేస్తుండటంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గందం వెదజల్లుతోంది.
ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలు...
మున్సిపాలిటీ చెత్త కారణంగా దుర్వాసన వస్తుండటంతో ప్రశ్నించిన కాలనీవాసులపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చెత్త డంప్ విషయమై గతంలో మున్సిపల్ వాహనాలను కాలనీవాసులు అడ్డుకొనడంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించారు. డంప్ యార్డు తొలగించి, మరోచోట ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా విన్నవిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. సమస్యలు చెప్పుకుంటే ఇంటి పన్నులు చెల్లించాలని, లేకుంటే ఇళ్లకు తాళం వేస్తామని, నీటి సరఫరా బంద్ చేస్తామని, కరెంటు కనెక్షన్ తీసి వేయిస్తామని బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని వాపోతున్నారు.
డంప్ యార్డు ఏర్పాటులో జాప్యమెందుకు...?
మంచిర్యాల పట్టణానికి డంప్ యార్డు ఏర్పాటు చేయడంలో దశాబ్దాల కాలంగా జాప్యం జరుగుతూనే ఉంది. డంప్ యార్డు కోసం హాజీపూర్ మండలం వేంపల్లి శివారు కొత్త చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో సర్వే నంబర్లు 154, 155, 159లలో 21 ఎకరాల భూమిని గతంలో ఉపయోగించారు. స్థానికులు అభ్యంతరంతో అక్కడ చెత్త వేయడాన్ని నిలిపివేశారు. వర్షాకాలంలో కుళ్లిన పదార్థాలు చెరువులోకి చేరే ప్రమాదం ఉన్నందున చెత్త డంప్‌ను నిలిపివేయాలని గ్రామస్తులు కొందరు హైకోర్టులో పిటీషన్ వేయడంతో మళ్లీ అండాళమ్మ కాలనీయే దిక్కయింది.
శాశ్వత పరిష్కారం ఎప్పుడు..?
వేంపల్లి సమీపంలో చెత్త డంప్‌ను నిలిపి వేసినప్పటి నుంచి అండాళమ్మ కాలనీ సమీపంలోని తాత్కాలిక డంప్ యార్డులో మున్సిపాలిటీ చెత్తను వేస్తున్నారే తప్ప, శాశ్వత పరిష్కారానికి కృషి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక డంప్ యార్డులుగా రాళ్ల వాగు ఒడ్డు, గోదావరి తీరం, బైపాస్ రోడ్డు, అండాళమ్మ కాలనీ సమీపంలోని జాలా గుట్టలను ఉపయోగిస్తున్నారు. అక్కడ వేసే మున్సిపాలిటీ చెత్తతోపాటు చికెన్ సెంటర్ల వ్యర్థాలు పేరుకుపోతుండటంతో మున్సిపల్ సిబ్బంది వారానికోసారి కాల్చి వేస్తున్నారు. వాటిని కాల్చే సమయంలో దట్టమైన పొగతోపాటు, దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కాలనీవాసుల ఆందోళనలతో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొంత స్థలం కేటాయించారు. స్థలం కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ చెత్తను డంప్ చేయకుండా మళ్లీ అండాళమ్మ కాలనీలో వేస్తున్నారు.
కాలుష్యంతో ఇబ్బందులు....
ఇదిలా ఉండగా అండాళమ్మ కాలనీలో డంప్ యార్డులో ఉన్న చెత్తను అక్కడి నుంచి ఎత్తివేసి కొద్ది రోజులుగా సమీపంలోని రహదారిని ఆనుకొని వేస్తున్నారు. ఎక్స్‌కావేటర్ సహాయంతో చెత్తను రోడ్డు పక్కన వేస్తుండటంతో ఆ ప్రాంతమంతా కాలుష్యం వెదజల్లుతోంది. కాలనీతోపాటు గ్రీన్‌సిటీ, పవర్ సిటీ కాలనీ రంగంపేట ప్రాంతాల్లో కాలుష్యం వ్యాపిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త తగులబెడుతున్న ప్రాంతానికి సమీపంలో నివాస గృహాలతోపాటు మిషన్ భగీరథ నీటి ట్యాంకు, పంక్షన్ హాళ్లు, స్పోర్ట్స్ క్లబ్, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఉన్నాయి. ప్రజలతోపాటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ ట్యాంకు చుట్టూ చెత్తకుప్పలు పోస్తుండటంతో అక్కడికి వెళ్లేందుకు వీలుగాక రెండు రోజులుగా మంచినీరు విడుదల చేయలేదని కాలనీ వాసులు చెబుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
Updated Date - Nov 12 , 2024 | 10:24 PM