బోరు బావికి తాళం... మహిళల ధర్నా
ABN, Publish Date - Nov 23 , 2024 | 10:39 PM
పట్టణంలోని రజక కాలనీలోని బోరు బావికి మున్సిపల్ అధికారులు తాళం వేయడంతో ఆగ్రహించిన మహిళలు, కాలనీ వాసులు శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు, దుస్తులతో ధర్నా నిర్వహించారు.
చెన్నూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని రజక కాలనీలోని బోరు బావికి మున్సిపల్ అధికారులు తాళం వేయడంతో ఆగ్రహించిన మహిళలు, కాలనీ వాసులు శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు, దుస్తులతో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం రజక కాలనీలోని బోరుకు మున్సిపల్ అధికారులు తాళం వేశారని, దీంతో బట్టలు ఉతకడానికి, మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరుబావికి తాళం వేస్తే నీటి కోసం ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. స్పందించిన మున్సిపల్ అధికారులు బోరు బావికి వేసిన తాళం తీస్తామని పేర్కొనడంతో ధర్నాను విరమించారు. అక్కడ రెండు వర్గాల మధ్య ఏర్పడుతున్న తగాదాల వల్లనే బోరుబావికి వేరే వర్గం వారు తాళం వేశారని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - Nov 23 , 2024 | 10:39 PM