నేటి నుంచి కులగణన...
ABN, Publish Date - Nov 05 , 2024 | 10:56 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్వే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుండగా, 60 రోజుల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు.
మంచిర్యాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్వే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుండగా, 60 రోజుల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు. ఇండ్లకు నంబర్లు వేసే పని ఇప్పటికే పూర్తికాగా, ఇక కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వే ద్వారా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ ముఖచిత్రం తేటతెల్లం కానుందని అభిప్రాయపడుతున్నారు. 2014 ఆగస్టు 19న ఒక రోజులో గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. దీంతో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారంతా ఆ రోజు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో సభ్యులందరూ ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకరు వివరాలు చెబితే ఎన్యూమరేటర్లు నమోదు చేసుకుంటారు.
అన్ని వివరాలు చెప్పాల్సిందే...
సర్వేలో కులంతో పాటు ఆదాయం, ఆస్తులు వంటి వ్యక్తిగత వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. తెలంగాణలో ఆయా కులాల జనాభా ఎంత? ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? వారు ఏం చదువుకున్నారు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారు? వారికి ఉన్న ఆస్తిపాస్తులు ఏమిటి? వాటిని ఎలా సంపాదించారు? ఇప్పటివరకు ఏఏ పథకాల ద్వారా లబ్ధిపొందారు? వంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
75 ప్రశ్నలతో ఫార్మాట్...
75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్లో ప్రతీ కుటుంబానికి ఒక సీరియల్ నంబర్‌తోపాటు జిల్లా, మండలం, గ్రామం, ఆవాసాలకు కోడ్ నంబర్లు కేటాయించారు. పార్ట్ 1లో 2 నుంచి 11 కాలమ్స్‌లో సాధారణ వివరాలు నమోదు చేస్తారు. కుటుంబ యజమానితోపాటు సభ్యుల వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తారు. ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు. 12 నుంచి 19 కాలమ్స్‌లో విద్య వివరాలు తెలుసుకుంటారు. మొబైల్ నంబర్, దివ్యాంగులు అయితే రకం, వైవాహిక స్థితి, స్కూల్లో చేరే నాటికి వయసు, స్కూల్ రకం, అత్యున్నత విద్యార్హత, ఏ మీడియం చదివారు, స్కూల్ మానేస్తే దానికి సంబంధించిన వివరాలు ఒకటి నుంచి 19వ కాలమ్ వరకు అడుగుతారు.
జిల్లాలో 8 లక్షల పై చిలుకు కుటుంబాలు
సమగ్ర కుటుంబ సర్వే చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో మొత్తం 8,20,137 కుటుంబాలను అధికారులు గుర్తించారు. ఆయా కుటుంబాల్లో సర్వే చేరసేందుకు మొత్తం 1981 ఎన్యూమరేటర్లను నియమించారు. ప్రతి మండలంలో గ్రామ పంచాయతీల వారీగా ఒక్కో ఎన్యూమరేటర్ కనీసం 150 కుటుంబాల్లో సర్వే చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ఎన్యూమరేటర్ నియామకంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఈ విషయంలో మంగళవారం రాత్రి వరకు ఎలాంటి స్పష్టత రాలేదని జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మహ్మద్ ఖాసిం తెలిపారు. ఎన్యూమరేటర్లుగా పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీలు, ఏఈఓలను ఇప్పటి వరకు నియమించారు.
Updated Date - Nov 05 , 2024 | 10:56 PM