ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాల కూల్చివేత
ABN, Publish Date - Oct 03 , 2024 | 10:56 PM
అనాలోచిత నిర్ణయాలతో అనువుగాని చోట నిర్మించదలచిన భవన నిర్మాణాన్ని కూల్చివేశారు. జిల్లా కేంధ్రంలోని ప్రభుత్వ అతిథిగృహం ఆవరణలో రెండు సంవత్సరాల క్రితం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సమీకృత మార్కెట్ భవన నిర్మించేందుకు ప్రతిపాదించారు. సుమారు రూ.7 కోట్ల అంచనా వ్యయంతో జీ+2 అంత స్థులతో భవన నిర్మాణం ప్రారంభించగా వివిధ కారణాలతో పిల్లర్ల దశలో పనులు నిలిచిపోయాయి.
మంచిర్యాల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): అనాలోచిత నిర్ణయాలతో అనువుగాని చోట నిర్మించదలచిన భవన నిర్మాణాన్ని కూల్చివేశారు. జిల్లా కేంధ్రంలోని ప్రభుత్వ అతిథిగృహం ఆవరణలో రెండు సంవత్సరాల క్రితం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సమీకృత మార్కెట్ భవన నిర్మించేందుకు ప్రతిపాదించారు. సుమారు రూ.7 కోట్ల అంచనా వ్యయంతో జీ+2 అంత స్థులతో భవన నిర్మాణం ప్రారంభించగా వివిధ కారణాలతో పిల్లర్ల దశలో పనులు నిలిచిపోయాయి. అయితే సమీకృత మార్కెట్ సముదాయానికి ఎంపిక చేసిన స్థలంపై అధికారులు, ప్రజాప్రతినిధులపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం భవనం కోసం నిర్మించిన పిల్లర్లలను కూల్చివేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.2.5 కోట్లు వెచ్చించి పిల్లర్ల నిర్మాణం చేపట్టగా ఆ నిధులన్నీ వృథా అయ్యాయి.
ఎంసీహెచ్ కోసం స్థలం ఎంపిక
ప్రస్తుతం భవన నిర్మాణాన్ని కూల్చిన స్థలంలో గతంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) నిర్మించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఆ స్థలానికి ఎదురుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉండటం, ప్రతిపాదిత స్థలంలో ఎంసీహెచ్ భవనం నిర్మిస్తే వైద్యం కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటుందని అప్పటి అధికారులు సైతం అభిప్రాయ పడ్డారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉండటంతో బస్సుల్లో ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉండటంతోపాటు రెండు ఆస్పత్రు లకు మధ్య జాతీయ రహదారి ఉండటంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే చికిత్స పొందేందుకు వెసలుబాటు కలుగుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఎంసీహెచ్ కోసం దాదాపు స్థలం ఎంపిక పూర్తయ్యే సమయానికి ఆకస్మాత్తుగా స్థలమార్పిడి జరిగింది. ఎంసీహెచ్‌ను గోదావరి నది ఒడ్డున నిర్మించడంతో తరుచుగా వర్షాకాలంలో ముంపునకు గురవుతోంది. దీంతో అందులో చికిత్స పొందే గర్బిణీలు, బాలింతలు, శిశువులను మరోచోటుకి తరలించాల్సి వస్తోంది. ఈ కారణంగా వారంతా ఇబ్బందులు పడుతుండగా, ప్రస్తుత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు చొరవతో ఎంసీహెచ్ మళ్లీ ప్రభుత్వ అతిథిగృహ ఆవరణలోకే రానుంది.
రూ. 50 కోట్లకు అనుమతులు మంజూరు
ప్రభుత్వ అతిథి గృహ ఆవరణలో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాన్ని కూల్చివేస్తున్నందున ఆ స్థలంలో సూపర్ స్పెషా లిటీ ఆసుపత్రి నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించగా, తెలంగాణ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ తొలి విడుతగా రూ.50 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ గత నెల 12న జీవోఆర్టీ నెంబర్ 546ను విడుదల చేసింది.
కార్పోరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్...
ప్రభుత్వ అతిథిగృహ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు హామీలో భాగంగా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ. 300 కోట్ల అంచనాతో ఏడు అంతస్థులతో ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టనుండగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు ప్రజలకు అందనున్నాయి. ఈ మేరకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. దీంతో ఆసుపత్రి నిర్మాణానికి మార్గం సుగమంకాగా రెండున్నర సంవత్సరాల కాలంలో భవన నిర్మాణం పూర్తికానుంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంతో మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు పొరగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. గురువారం ప్రతిపాదిత స్థలం వద్ద ఎమ్మెల్యే ఆస్పత్రి భవన సముదాయం నమూనా చిత్రాన్ని ప్రదర్శించారు.
ఎంసీహెచ్ కూడా అక్కడే
ప్రస్తుతం గోదావరి సమీపంలో ఉన్న ఎంసీహెచ్‌ను కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలోకి మార్చనున్నారు. ఈ మేరకు ఆస్పత్రి ప్రాంగణంలో ప్రత్యేక భవన నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంసీహెచ్ రెండు ఒకే ప్రాంగణంలో నిర్మించడం రోగులకు వైద్యసేవల పరంగా అందుబాటులో ఉండనున్నాయి.
Updated Date - Oct 03 , 2024 | 10:56 PM