సింగరేణి కార్మికులకు నేడు దీపావళి బోనస్
ABN, Publish Date - Oct 24 , 2024 | 11:14 PM
సింగరేణి కార్మికులకు దీపావళి (పీఎల్‌ఆర్) బోనస్ ఈ నెల 25న బ్యాంకుల్లో జమ చేయనుంది. ఈ మేరకు రూ.358 కోట్లు యాజమాన్యం చెల్లించేందుకు ప్రకటించింది. గత నెల 29న ఢిల్లీలో జరిగిన పీఎల్‌ఆర్ బోనస్ చర్చల్లో కార్మికు లకు దీపావళి బోనస్‌ను యాజమాన్యం ప్రకటించింది. యాజమాన్యం నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు దీపావళి (పీఎల్‌ఆర్) బోనస్ ఈ నెల 25న బ్యాంకుల్లో జమ చేయనుంది. ఈ మేరకు రూ.358 కోట్లు యాజమాన్యం చెల్లించేందుకు ప్రకటించింది. గత నెల 29న ఢిల్లీలో జరిగిన పీఎల్‌ఆర్ బోనస్ చర్చల్లో కార్మికు లకు దీపావళి బోనస్‌ను యాజమాన్యం ప్రకటించింది. యాజమాన్యం నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో కార్మికునికి రూ.93 వేలు
దీపావళి బోనస్‌ను యాజమాన్యం ముందస్తుగా ప్రకటించింది. ఇందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న సుమారు 44వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.93,750 చొప్పున బ్యాంకుల్లో జమ చేయనుంది. దీపావళి బోనస్ గతేడాదితో పోల్చితే ఒక్కో కార్మికుడికి రూ.8,250 అదనంగా అందనుంది. గతేడాది ఒక్కో కార్మి కుడికి రూ.85,500 చెల్లించగా, ప్రస్తుతం రూ.8,250 పెంచుతూ బోనస్‌ను చెల్లిస్తున్నారు. బోనస్‌ను యాజమాన్యం యేటా పెంచుతూ వస్తుండటంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
కార్మికుల సంక్షేమం కోసం
సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. దసరా పండుగను పురస్కరించుకొని లాభాల వాటాను 33 శాతం పెంచగా, ఒక్కో కార్మికునికి సుమారు రూ.3 లక్షల పై చిలుకు నగదు బ్యాంకుల్లో జమ చేసింది. ప్రస్తుతం దీపావళి బోనస్‌ను కూడా రూ. 8వేలకు పైగా పెంచడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి బాటన పయనిస్తున్న కంపెనీ కార్మికుల సంక్షేమంపై కూడా దృష్టి సారించింది. సొంత ఇండ్లు నిర్మించుకున్న కార్మికులకు పది లక్షల రుణంపై వడ్డీ చెల్లింపు, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబానికి ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటు మొత్తాన్ని పది రెట్లకు పెంచడం, కార్మికులు చెల్లించే కరెంటు చార్జీలు రద్దు, ఉన్నత చదువులో ఉన్న కార్మిక పిల్లలకు ఫీజు చెల్లింపు, లాభాల బోనస్, పండుగ అడ్వాన్స్ పెంపు, తదితర చర్యలు చేపడుతోంది.
దీపావళి బోనస్ తొలిసారిగా సింగరేణిలో 1964 నుంచి అమల్లోకి వచ్చింది. బోనస్ రావడానికి కారణం ఏఐటీయూసీ కృషి ఉండగా, 1964లో అప్పటి యూనియన్ అధ్యక్షుడు విఠల్‌రావు చొరవతో యాజమాన్యం బోనస్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఒక్క సింగరేణిలోనే బోనస్ అమలుకాగా 1965లో చట్టం వచ్చిన తరువాత అన్ని కంపెనీల్లో కార్మికులకు బోనస్ అందుతోంది.
Updated Date - Oct 24 , 2024 | 11:14 PM