ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక స్థానిక సంస్థల ఎన్నికలు

ABN, Publish Date - Nov 09 , 2024 | 10:46 PM

పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

మంచిర్యాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీల పాలన ఈయేడు జనవరిలో ముగియగా, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల పాలకవర్గాల పదవీకాలం జూలైతో ముగిసింది. దీంతో స్థానిక సంస్థల పాలన ప్రత్యేకాఽధికారుల చేతుల్లోకి వెళ్లింది. గరిష్టంగా మూడు నెలలకు మించి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగరాదనే నిబంధన ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి అనివార్యమైంది.

రిజర్వేషన్లలో మార్పు

స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడున్న రిజర్వేషన్లే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంచాయతీ వార్డులు మొదలుకొని జడ్పీ చైర్మన్‌ స్థానం వరకు క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లు మారనున్నాయి. ప్రస్తుతం బీసీ కులగణన సర్వే జరుగుతున్నందున రిజర్వేషన్లలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీసీ కులగణన అనంతరం ఆ సామాజిక వర్గానికి సంబంధించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడున్న స్థానాలకు అదనంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇంతకాలం రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరంగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు కులగణన అనంతరం ఆ అవకాశం లభించనుంది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన అనంతరం సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆశావహులు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే కుతూహలంతో ఉన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్ట సవరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు పదేళ్ల వరకు ఉండేలా మార్పులు చేసింది. అయితే బీసీ కులగణన జరుగుతున్నందున రిజర్వేషన్లలో మార్పు అనివార్యం కానుంది. బీసీ కులగణన ప్రక్రియ ముగియగానే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సామగ్రి సైతం జిల్లాకు చేరింది.

జిల్లాలో 621 గ్రామాలు....

స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల పరిధిలోని 621 గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో రెండు పంచాయతీ డివిజన్లలో 16 మండలాలు ఉండగా, వాటి పరిధిలో మొత్తం 2730 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 3,78,912 మంది ఉండగా, ఎంపీటీసీ స్థానాలు 130, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు 16 ఉన్నాయి. 2730 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 2018 పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2019లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగగా, 2024 జనవరి 31తో గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో ముందుగా పంచాయతీ ఎన్నికలకు అధికారులకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

ఆ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తారా...?

మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల పరిస్థితిపై ప్రస్తుతం జోరుగా చర్చ కొనసాగుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఏర్పడుతుందనే ప్రచారం జరుగుతుండటంతో ఏయే గ్రామాలను విలీనం చేస్తారనే చర్చ సాగుతోంది. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పడితే సమీప మున్సిపాలిటీ నస్పూర్‌ను విలీనం చేయనున్నారు. ఆయా మున్సిపాలిటీలతోపాటు పరిసర గ్రామాలు కూడా కార్పొరేషన్‌లో విలీనమయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్‌ ఏర్పాటుకు కావలసిన కనీస జనాభాను దృష్టిలో ఉంచుకుని కొన్ని గ్రామాలను విలీనం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగా హాజీపూర్‌ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట గ్రామాల విలీనం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో ఎలక్షన్లు నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి.

Updated Date - Nov 09 , 2024 | 10:46 PM