క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్ధాపన
ABN, Publish Date - Nov 16 , 2024 | 10:28 PM
మంచిర్యాల గోదావరి రోడ్డులోని మెడికల్ కాలేజీ ప్రాంగణంలో రూ. 23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు శనివారం శంకుస్ధాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. 50 పడకల సామర్ధ్యం గల ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కేసులకు పరీక్షలు చేస్తారన్నారు.
గర్మిళ్ల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల గోదావరి రోడ్డులోని మెడికల్ కాలేజీ ప్రాంగణంలో రూ. 23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు శనివారం శంకుస్ధాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. 50 పడకల సామర్ధ్యం గల ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కేసులకు పరీక్షలు చేస్తారన్నారు. మంచిర్యాలను మెడికల్ హబ్‌గా మారుస్తామన్న హామీని అమలు చేస్తామని, ఈ నెల 21న పనులు ప్రారంభమవుతాయన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహా, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు హాజరవుతారని తెలిపారు. రెండున్నరేళ్లలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి విపక్షల విమర్శలకు తాళం వేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ హరీష్‌చంద్రరెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సులేమాన్, వైస్ ప్రిన్సిపాల్ రేఖ, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, పట్టణాధ్యక్షుడు తూముల నరేష్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
నర్సింగ్ కాలేజీ పనులు ప్రారంభం
మంచిర్యాల సాయికుంటలో రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం మార్కెట్ యార్డులో మెడికల్ కాలేజీ పక్కన నర్సింగ్ కాలేజీ నిర్వహిస్తున్నామన్నారు. సొంత భవనం నిర్మాణంతో సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, నస్పూర్ మున్సిపల్‌చైర్మన్ సుర్మిళ్ల వేణు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు తూముల నరేష్,కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
మంచిర్యాల అర్బన్, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన బాలిక అశ్రమ పాఠశాలను శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు సందర్శించారు. ఇటీవల ఆహారం వికటించి అస్వస్థతకు గురై కోలుకున్న విద్యార్థినులతో మాట్లాడి వారి క్షేమసమాచారాన్ని తెలుసుకున్నారు. విద్యార్థినుల కోరిక మేరకు రూ.50వేల విలువ గల స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలను విరాళంగా అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భోజనం విషయంలో రాజీ వద్దన్నారు. వారికి రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల మెస్ చార్జీలను పెంచిందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, నాయకులు చిట్ల సత్యనారాయణ, తూముల నరేష్ ఉన్నారు.
వైకుంఠధామం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరంలో రూ.4కోట్లతో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల ముని, ఎంఈ మసూద్ అలీ, ఏఈ రాజేందర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 10:28 PM