భూముల రిజిస్ట్రేషన్లలో అవినీతి దందా
ABN, Publish Date - Oct 19 , 2024 | 11:07 PM
జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లలో అవినీతి దందా జరుగుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాల యాల్లో ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తు న్నారు. అన్నీ సక్రమంగా ఉన్న వాటిలో సైతం వసూళ్ళు చేపడుతు న్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మంచిర్యాల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లలో అవినీతి దందా జరుగుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాల యాల్లో ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తు న్నారు. అన్నీ సక్రమంగా ఉన్న వాటిలో సైతం వసూళ్ళు చేపడుతు న్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌లు చేయాల్సి వచ్చినప్పుడు సంబంధిత అధికారులకు కాసుల వర్షం కురుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అక్రమ వెంచర్లలో ఏర్పాటు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొంత కాలంగా ప్రభుత్వం నిలిపివేసింది. లే అవుట్ అనుమతులు ఉన్న వెం చర్లలోని ప్లాట్లకే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని అధికారులు అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్లు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రిజిస్ట్రేషన్లకు రంగం సిద్ధం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంతకాలం రిజిస్ట్రేషన్లకు నోచుకోని అక్రమ ప్లాట్లకు ఇకపై జరగనున్నాయి. ఈ మేరకు పలువురు డాక్యుమెంట్ రైటర్లతో ఇటీవల అవగాహన కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతకాలం నిబంధనల మేరకు డాక్యుమెంట్ టూ డాక్యుమెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగేవి. డాక్యుమెంట్ ప్రకారం ఎంత భూమి ఉంటే అంతే భూమిని ఒక పేరు నుంచి మరో పేరుపైకి మారుస్తూ రిజిస్ట్రేషన్లు చేసేవారు. అయితే ప్రస్తుతం ఆ ప్రక్రియను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్‌గా రెగ్యులర్ అధికారి వస్తుండడంతో ఈ లోగానే పనులు చక్కబెట్టాలనే తొందర రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు అధికారుల్లోనూ ఉంది. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ విధుల్లో చేరనున్నందున ఆ లోపే పెండింగులో ఉన్న కొత్త డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది.
డాక్యుమెంట్ రైటర్లే సూత్రధారులు
కొత్త డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లకు కొందరు డాక్యుమెంట్ రైటర్లే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. అధికారులకు సన్నిహితంగా ఉండే డాక్యుమెంట్ రైటర్లు అక్రమ రిజిస్ట్రేషన్‌ల బాధ్యత భుజాల పైన వేసుకున్నారు. అధికారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ పనులు చక్కబెడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇటీవల రహస్య సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సబ్ డివిజన్ ప్లాట్లకు ప్రత్యేకంగా రేటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో డాక్యుమెంట్‌కు రూ. 40 వేలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
వేలల్లో కొత్త డాక్యుమెంట్లు పెండింగ్....
ఐదారు నెలలుగా భూముల సబ్ డివిజన్ రిజిస్ట్రేషన్లు జిల్లాలో నిలిచిపోయాయి. దీంతో అక్రమ వెంచర్లలో ఏర్పాటు చేసిన ప్లాట్లకు సబ్ డివిజన్ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో కొత్త డాక్యుమెంట్లు పెండింగులో ఉన్నాయి. కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఒక్కో డాక్యుమెంట్ రైటర్ వద్ద కనీసం వంద కొత్త డాక్యుమెంట్ల వరకు పెండింగులో ఉన్నట్లు సమాచారం. వాటన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా తమ పనులు చక్కబెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. రెండు మూడు రోజుల్లో పెండింగులో ఉన్న కొత్త డాక్యుమెంట్లన్నింటికీ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి
అక్రమంగా భూముల సబ్ డివిజన్‌కు తెరలేవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడనుంది. వ్యవసాయ భూములను గుంటల్లో నుంచి గజాలకు నాలా కన్వర్షన్ చేయించిన తరువాత విక్రయించేందుకు కొత్త డాక్యుమెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొత్త డాక్యుమెంట్ తయారీ మొదలుకొని రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు 200 గజాల స్థలానికి భూమి విలువను బట్టి రూ.40 వేల నుంచి రూ.80 వేలకు రేట్లు ఫిక్స్ చేశారు. ఇందులో డాక్యుమెంట్ రైటర్ నుంచి సబ్ రిజిస్ట్రార్ వరకు వాటాలు ఉంటాయనే ఆరోపణలున్నాయి. పాత డాక్యుమెంట్ల కంటే కొత్త వాటికి 40 శాతం అదనంగా వసూలు చేస్తారని సమాచారం. వ్యవసాయ భూములను దొడ్డిదారిన కన్వర్షన్ చేయిస్తే ప్రభుత్వ ఆదానికి గండి పడుతుండగా, అధికారులకు మాత్రం కాసుల పంట పండుతోందనే చర్చ జరుగుతోంది.
Updated Date - Oct 19 , 2024 | 11:07 PM