హామీలు అమలు చేయడంలో ఎమ్మెల్యేలు విఫలం
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:06 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యే విఫలమయ్యారని, ప్రజలను మోసం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఛార్జ్‌షీట్ విడుదల చేసి మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యే విఫలమయ్యారని, ప్రజలను మోసం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఛార్జ్‌షీట్ విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి యేడాది గడిచినా ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. రైతులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు, వృద్ధులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టిస్తూ అల్లర్లను ప్రేరేపిస్తున్నారన్నారు. వ్యాపారస్తులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మంచిర్యాలలో టూ టౌన్ రైల్వే వంతెన వంద రోజుల్లో, ఎల్లంపల్లి భూనిర్వాసితుల పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
మంచిర్యాల - పెద్దపల్లి జిల్లాల మధ్య గోదావరిపై వంతెనకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనులు ప్రారంభిస్తే ఎమ్మెల్యే కమీషన్ కోసం ఆ కాంట్రాక్టు రద్దు చేయడంతో రెండు జిల్లాల ప్రజలు రవాణా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎన్నికల సమయంలో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసి అతని కొడుకుకు ఉద్యోగం ఇచ్చాడన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు. ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారన్నారు. నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, రజనీష్ జైన్, ఆరుముళ్ల పోశం, పట్టి వెంకటకృష్ణ, గుండ ప్రభాకర్, అమురాజుల శ్రీదేవి, ఆకుల అశోక్‌వర్ధన్, కృష్ణమూర్తి, తిరుపతి, రమేష్, సంతోష్,వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:06 PM