దీపావళికి కొత్త రెవెన్యూ చట్టం...!
ABN, Publish Date - Oct 23 , 2024 | 10:48 PM
ఆర్వోఆర్-2024 కొత్త చట్టం రూపకల్పనకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీపావళికి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్టులో ముసాయిదాను సిద్ధం చేసిన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలు, చట్టానికి సంబంధించిన అంశాలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి.
మంచిర్యాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆర్వోఆర్-2024 కొత్త చట్టం రూపకల్పనకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీపావళికి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్టులో ముసాయిదాను సిద్ధం చేసిన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలు, చట్టానికి సంబంధించిన అంశాలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. గ్రామస్థాయిలో ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, సమస్యలపై అప్పిలేట్ అథారిటీ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో భూ కమిషన్ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. మొన్నటి వరకు ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీకావు. రైతుల ప్రమేయం లేకుండా రెవెన్యూ రికార్డుల్లో తప్పులు దొర్లడంతో సమస్య జఠిలమైంది. రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులకు లక్షలాది మంది రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పూర్వీకుల నాటి నుంచి పట్టాగా ఉన్న భూములను ప్రభుత్వానివంటూ నోటీసులు లేకుండానే నిషేధిత జాబితాలో పెట్టి అష్టకష్టాలు పెడుతున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.
’భూ మాత’గా నామకరణం
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ పేరును రేవంత్ సర్కారు ’భూ మాత’గా మార్పు చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న భూ రికార్డుల నిర్వహణ పద్ధతులను పరిశీలించిన అనంతరం వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి వేర్వేరు రికార్డులు చేయాలనే నిశ్చయానికి ప్రభుత్వం వచ్చింది. భూ రికార్డుల నిర్వహణకు మెరుగ్గా ఉండే విధంగా ముసాయిదా బిల్లుపై రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోనుంది. భూ సేకరణలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించేలా మార్పులు తేవడంతోపాటు పట్టాదారు మృతి చెందిన పక్షంలో వారసత్వ భూముల బదలాయింపు ప్రక్రియ వేగవంతం చేయనున్నారు. గ్రామాల్లో ఆబాదీ భూముల రికార్డులను ఆధునీకరించడం, సాదా బైనామా, భూముల రిజిస్ట్రేషన్ రుసుం వసూలు చేయడం, ఈసీలో అనుభవదారుడి పేరిట కాలమ్ ప్రవేశపెట్టడం లాంటి మార్పులు చట్టంలో చోటు చేసుకోనున్నాయి. అప్పీల్ అథారిటీ ఆర్డీవోలకు అప్పగించేలా చర్యలు తీసుకోనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులకు నష్టం వాటిల్లకుండా చట్టాన్ని రూపొందించనున్నారు.
భూముల రక్షణకు సిబ్బంది
గ్రామస్థాయిలో భూముల రక్షణకు, రెవెన్యూ సేవలకు ఒక సహా యకుడిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం వీఆర్‌ఏలను, వీఆర్వోల్లో అర్హులైన వారిని పరీక్ష ద్వారా ఎంపిక చేయడం ద్వారా గ్రామ రక్షణ సిబ్బందిని నియమించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెవెన్యూ నుంచి తొలగించిన వీఆర్‌ఏ, వీఆర్వోలను తిరిగి అదే వ్యవస్థలో కొనసాగించే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ సర్కారు వారి ద్వారా గ్రామాల్లో సేవలు పొందాలనే తలంపుతో ఉంది.
తుది దశలో ప్రక్రియ
ప్రస్తుతం అమలులో ఉన్న తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో ఆర్వోఆర్ 2024 రూపకల్పన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. డ్రాఫ్ట్‌పై అభిప్రాయాలను క్రోడీకరించిన అధికారులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముసాయిదా పత్రాన్ని అందజేశారు. చట్టం రూపకల్పనకు సంబంధించిన కార్యాచరణపై మంత్రి తాజాగా సీఎంతో చర్చించినట్లు తెలిసింది. త్వరలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ముసాయిదాపై చర్చించనున్నారు. అనంతరం శాసనసభ సమావేశాల్లో ఆమోదించడం ద్వారా గానీ, ఆర్డినెన్స్ జారీ ద్వారా కొత్త చట్టాన్ని దీపావళి నుంచి అమలులోకి తీసుకురావాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.
ఎన్‌ఐసీకి బదలాయింపు...
ధరణి పోర్టల్‌ను పైవ్రేటు సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఐసీకి బదలాయింపు ప్రక్రియను ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసింది. ధరణి పోర్టల్‌లోని పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా దాదాపు పరిష్కరించారు. కొత్త చట్టంతో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించిన దరఖాస్తులే మిగిలినట్లు సమాచారం. నూతన చట్టంలో సాదా బైనామాల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించగానే పోర్టల్‌లో ఆప్షన్లు ఇవ్వడం ద్వారా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసేందుకు వీలు కలుగనుంది. ఇంతకాలం ఆర్వోఆర్ చట్టంలో వెసలుబాటు లేక సాదా బైనామాలు పెండింగ్ పడుతూ వస్తుండగా, కొత్త చట్టంతో ఆ సమస్యకు పరిష్కారం లభించనుంది.
Updated Date - Oct 23 , 2024 | 10:48 PM