బస్సు సర్వీసులేవీ....?
ABN, Publish Date - Nov 23 , 2024 | 10:45 PM
రద్దీ ఉన్న రూట్లలో ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణి కులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. చెన్నూరు రూట్‌లో ఆదాయం ఉన్నా.... బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.
మంచిర్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రద్దీ ఉన్న రూట్లలో ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణి కులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
చెన్నూరు రూట్‌లో ఆదాయం ఉన్నా.... బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సమయానికి బస్సు సర్వీసులు లేకపోవ డంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు.
చెన్నూరు సెంటర్ పాయింట్...
మంచిర్యాల ఆర్టీసీ డిపో నుంచి జైపూర్ మీదుగా వివిధ మండలాలు, గ్రామాలకు వెళ్లేందుకు చెన్నూరు బస్టాండ్ సెంటర్ పాయింట్‌గా ఉంది. చెన్నూరు బస్టాండ్ నుంచి మండలంలోని ఆస్నాద్, సోమనపల్లి, నాగాపూర్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది. నాగాపూర్ రోడ్డు వర్షాలకు గుంతలమయం కావడంతో ప్రస్తుతం ఆ రూట్‌లో బస్సులు నడపడం లేదు. అయితే వేసవి, శీతాకాలాల్లో రద్దీ అధికంగానే ఉంటుంది. చెన్నూరుకు 12 కిలోమీటర్ల దూరంలో కోటపల్లి మండలం ఉంది. మండలంలోని వివిధగ్రామాలకు వెళ్లేందుకు మంచిర్యాల డిపో బస్సులపైనే ప్రజలు ఆధారపడతారు. మండలం లోని మల్లంపేట, సర్వాయిపేట, వెంచపల్లి, పారుపెల్లి, రావులపల్లి, ఎర్రాయిపేట, కొల్లూరు, రాంపూర్, దేవుల వాడ, వెల్మపల్లి, లక్ష్మీపూర్, రాపనపల్లి, అర్జునగుట్ట తదితర గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలు చెన్నూరు, మంచిర్యాలకు రాకపోకలు సాగిస్తుం టారు. ప్రయాణికుల సంఖ్యకు సరిపడా సర్వీసులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
చెన్నూరు మీదుగా అధికంగా ప్రయాణాలు సాగించే ముఖ్యమైన మండలం వేమనపల్లి. చెన్నూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వేమనపల్లి మండల కేంద్రం ఉంది. చెన్నూరు నుంచి కోటపల్లి మీదుగా వేమనపల్లికి వెళ్లాల్సి ఉంటుంది. మండలంలోని కేతనపల్లి, ముల్కలపేట, నీల్వాయి, వేమనపల్లి, గొర్లపల్లి, సొంపుటం గ్రామాలకు ప్రస్తుతం బస్సు సౌకర్యం ఉంది. ఈ రూట్‌లోనూ సరిపడా బస్సులు లేవని ప్రయాణికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ-మహారాష్ట్రలను కలుపుతూ ప్రాణహిత నదిపై కోటపల్లి మండలం రాపన్‌పల్లి వద్ద అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ మార్గంలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. ప్రాణహిత వంతెన మీదుగా మహారాష్ట్రలోని సిరొంచ, తెలంగాణలోని కాళేశ్వరం, భూపాల్‌పల్లి ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుం టారు. సమయానికి బస్సు సర్వీసులు అందుబాటులో లేనికారణంగా వారంతా ప్రైవేటు వాహనాలపై ఆధారపడతారు.
అధిక ఆదాయం
చెన్నూరు రూట్‌లో ఆర్టీసీకి పుష్కలంగా ఆదాయం సమకూరుతోంది. మంచిర్యాల డిపో నుంచి రోజు చెన్నూరు రూట్‌లో 40 బస్సులు వివిధ మండలాలు, గ్రామాలకు నడుస్తున్నాయి. 40 సర్వీసులు 78 ట్రిప్పులు కొడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నిత్యం 11వేల పై చిలుకు ప్రయాణికులు కేవలం బస్సుల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. 78 సర్వీసుల్లో సగటున 140 మంది ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. రెండు, మూడు గంటలపాటు నిలబడాల్సి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మంచిర్యాల డిపోలో అన్ని రూట్లలో కలిపి మొత్తం రోజుకు రూ.35 లక్షల ఆదాయం సమకూరుతోంది. అందులో నగదు రూ.17 లక్షలుకాగా మిగతా మహాలక్ష్మి పథకం కింద వస్తోంది. డిపోకు నిత్యం వస్తున్న ఆదాయంలో అధికంగా చెన్నూర్ రూట్‌లోనే రావడం గమనార్హం. అయినా ఈ మార్గంలో సరిపడా బస్సుల సంఖ్యను అధికారులు పెంచడం లేదు.
బస్సుల సంఖ్య పెంచాలి...మల్లారెడ్డి, చెన్నూరు
సుమారు రెండు గంటలపాటు చెన్నూరు బస్సు కోసం వేచి చూస్తున్నా. చెన్నూరు వైపు నుంచి మంచిర్యాలకు నిత్యం చాలా మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీకి ఆదాయం ఉన్నా బస్సులను మాత్రం పెంచడం లేదు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను నడిపించాలి.
బస్సులను పెంచుతాం....జనార్దన్, డిపో మేనేజర్
మంచిర్యాల డిపో నుంచి చెన్నూరు వైపు సరిపడా బస్సు సర్వీసులను నడుపుతున్నాం. కొన్ని రూట్లలో వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో తాత్కాలికంగా బస్సులను నిలిపివేశాం. రాకపోకలకు అనుకూలం కాగానే ట్రిప్పుల సంఖ్యను పెంచుతాం. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి రూట్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని బస్సులను పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.
Updated Date - Nov 23 , 2024 | 10:45 PM