యాసంగికి సిద్ధం
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:08 PM
యాసంగి సాగుకు రైతులు సమాయత్తమయ్యారు. అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో సాగు పనులకు శ్రీకారం చుట్టారు. వరి నాడు మడులు వేసుకొని నాట్లు వేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. శనగలు, మక్కలు, మినుములు విత్తుకుంటున్నారు.
నెన్నెల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): యాసంగి సాగుకు రైతులు సమాయత్తమయ్యారు. అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో సాగు పనులకు శ్రీకారం చుట్టారు. వరి నాడు మడులు వేసుకొని నాట్లు వేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. శనగలు, మక్కలు, మినుములు విత్తుకుంటున్నారు. యాసంగి సీజన్‌లో జిల్లాలో 1,24,292 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు. ఇందులో 1.06 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని చెబుతున్నారు. ఈ సీజన్‌లో సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఈ ఏడు పప్పుదినుసుల సాగు విస్తీర్ణం పెంచేందుకు అధికారులు సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
-వరి సాగే ఎక్కువ...
యాసంగిలో వరి సాగుపైనే రైతులు మొగ్గు చూపిస్తున్నారు. గతేడాది యాసంగిలో 1,02,100 ఎకరాల్లో వరి సాగయింది. ఈ సీజన్‌లో జిల్లాలో 1,06,693 ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. 3,709 ఎకరాల్లో మక్క, 280 ఎకరాల్లో వేరుశనగ, 214 ఎకరాల్లో పెసలు, 244 ఎకరాల్లో జొన్న, 145 ఎకరాల్లో మినుములు, 90 ఎకరాల్లో నువ్వులు, 95 ఎకరాల్లో శనగ, 12,822 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని అధికారులు చెబుతున్నారు. గతంలో యాసంగిలో 80 శాతం రైతులు దొడ్డు వరి రకాలను సాగు చేశారు. ఈ సారి సన్నాల సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో బోరు బావులు, ప్రాజెక్టుల ఆయకట్టుకు రైతులు సన్నాలు సాగు చేస్తామని చెబుతున్నారు.
విత్తనాలు.. ఎరువులు రెడీ..
విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. సీజన్‌కు వివిధ పంటలకుగాను 34 వేల క్వింటాళ్ల విత్తనాలు ఆవసరం అవుతాయని అంచనాకు వచ్చారు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎరువులను డీలర్లకు పంపించారు. యూరియా 14,645 మెట్రిక్ టన్నులు, డీఏపీ 5,966 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 11,563 మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 4,436 మెట్రిక్ టన్నులు, జింక్ సల్ఫేట్ 1,030, ఎస్‌ఎస్‌పీ 2,023 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. అవసరాన్ని బట్టి మరిన్ని ఎరువులు తెప్పించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల నిల్వల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
- పప్పు దినుసుల సాగు పెంచేలా...
పప్పు దినుసుల సాగు పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో జిల్లాలో భారీగా సాగైన పప్పుదినుసుల పంట క్రమంగా తగ్గుతూ వస్తోంది. వాణిజ్య పంటల వైపు రైతులు మళ్లడంతో పప్పుదినుసుల సాగుపై ప్రభావం పడింది. జిల్లాలో కంది, శనగ, పెసర, మినుము వంటి పప్పు దినుసులు విరివిగా పండించే వారు. ప్రస్తుత జనాభాతో పోల్చితే పండిస్తోంది అతి తక్కువ. అవసరానికి సరిపడ ఉత్పత్తి లేక పోవడంతో పప్పు దినుసులను దిగుమతి చేసుకోక తప్పడం లేదు. కంది మినహా మినుము, పెసర, శనగ లాంటి పప్పు దినుసుల సాగు సమయం తక్కువే. పెట్టుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. కాని వాణిజ్య పంటలతో పోల్చుకుంటే రైతులకు లాభాలు తక్కువగా వస్తుడటంతో పప్పు దినుసుల సాగుపై మొగ్గు చూపడం లేదు. యాసంగిలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం పెంచేందుకు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కేవీకే వారు గిరిజన రైతులకు ఉచితంగా పప్పు దినుసుల విత్తనాలు అందజేసి సాగును ప్రోత్సహిస్తున్నారు.
-విత్తన వరిపై ఆసక్తి...
ఒప్పంద సేద్యం వైపు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలతో బైబ్యాక్ ఒప్పందంతో సాగు చేసే విత్తన వరితో గతేడాది లాభాలు పొందారు. ఈ సారి కూడా ఆడమగ వడ్లు సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులు ఆడ, మగ విత్తనాలు వేర్వేరుగా నారు పోసుకున్నారు. కంపెనీ వారే విత్తనాలు అందించి, యాజమాన్య పద్ధతులు సూచిస్తారు. గతేడాది జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఆడమగ వడ్లు సాగు కాగా ఈ ఏడు మరో 5 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. సాధారణ వరి కంటే ఈ సాగు భిన్నంగా ఉంటుంది. విత్తనోత్పత్తిలో భాగంగా ఆడమగ వరసలు వేసి సంకరీకరణ (క్రాసింగ్) చేసి విత్తనం పండిస్తారు. హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి విధానంలో విత్తనాలు అందజేయడంతో పాటు నాట్లు వేయడం, ఎరువులు, పురుగుల మందులు, కోతలు అన్ని కంపెనీ ప్రతినిధులు సలహాలు అందిస్తుండటంతో సాగు లాభదాయకంగా మారుతుందని రైతులంటున్నారు. సరైన సమయంలో తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల సంకర విత్తన దిగుబడి వస్తుంది. ఈ ఆడరకం వరి గింజలను ముందుగా ఒప్పందం చేసుకున్నట్లుగానే కంపెనీలు క్వింటాలుకు రూ.7వేల నుంచి రూ.7500ల వరకు కొనుగోలు చేస్తాయి. మగ ధాన్యాన్ని సాధారణ దొడ్డు రకాలుగా మార్కెట్లో అమ్ముకోవడంతో మరింత ఆదాయం వస్తున్నది. సాధారణ వరి సాగు కంటే విత్తనోత్పత్తి వరి సాగులో లాభాలు ఎక్కువగా ఉంటున్నాయని రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:08 PM