రైస్‌మిల్లర్లపై వేధింపులు తగదు
ABN, Publish Date - Oct 28 , 2024 | 10:41 PM
సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పేరుతో రైస్‌మిల్లర్లపై అధికారుల వేధింపులు తగవని రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుంత నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంఆర్ కింద క్వింటాల్‌కు 67 కిలోల సన్న బియ్యం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. నూకలతో కలిపి లెక్కగట్టినా 55 కిలోల కంటే దాటదని తెలిపారు.
మంచిర్యాల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పేరుతో రైస్‌మిల్లర్లపై అధికారుల వేధింపులు తగవని రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుంత నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంఆర్ కింద క్వింటాల్‌కు 67 కిలోల సన్న బియ్యం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. నూకలతో కలిపి లెక్కగట్టినా 55 కిలోల కంటే దాటదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో అధికారులు తమ మెడపై కత్తిపెట్టి దించుకునేలా చేస్తున్నారని, అనంతరం సీఎంఆర్ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పద్ధతితో రైస్‌మిల్లర్లు మనోవేదనకు గురవుతున్నారన్నారు. సీఎంఆర్ ఇవ్వలేదని క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులతో ఒక రైస్‌మిల్లర్‌కు పక్షవాతం వచ్చిందని, దానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. మిల్లుల్లో ధాన్యం దించుకునే సమయంలో తేమ శాతం 17 లోపు ఉండాలని, రాజకీయ ఒత్తిళ్లతో 21కి పైన ఉన్నా తీసుకోక తప్పడం లేదన్నారు. అలా తేమ అధికంగా ఉన్న ధాన్యం కొంతకాలానికి మురిగి పోతుందని, అప్పుడు సీఎంఆర్ ఎలా ఇచ్చేదన్నారు. అధికారుల ఒత్తిళ్లు తాళలేక మిల్లర్లు స్థిరాస్థులు అమ్ముకొని సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే, తాము బియ్యంగా మార్చి ప్రజలకు అందిస్తున్నామన్నారు. తమ పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఏకపక్షంగా ఆర్‌ఆర్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు. మిల్లులు నడిపి కేసుల పాలు అయ్యే బదులు, ఈ సారి ధాన్యం దించుకోవద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. తమ సమ్యలపట్ల ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, అప్పుడే ధాన్యం దించుకుంటామని స్పష్టం చేశారు. రా రైస్ మిల్లర్లు పడుతున్న కష్టాలను బాయిల్డ్ మిల్లర్లు పట్టించుకోవడం లేదని, ఈ కారణంగా తాము ప్రత్యేకంగా ’రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్’ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.
కార్యవర్గం ఏర్పాటు
సమావేశం అనంతరం జిల్లా రా రైస్ మిల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుంత నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా బత్తుల శ్రీనివాస్, కోశాధికారిగా మావాడి సంతోష్, ఉపాధ్యక్షుడిగా జాడి రమేష్, సంయుక్త కార్యదర్శిగా కాలేశ్వరం సాగర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఆకుల సాయి, దర్శనాల రమేష్, ఈసీ మెంబర్‌గా గుంత సుదీప్‌లు ఎన్నికయ్యారు.
Updated Date - Oct 28 , 2024 | 10:41 PM