ఆర్టీసీకి ‘కాసుల’ వర్షం
ABN, Publish Date - Oct 15 , 2024 | 10:39 PM
బతుకమ్మ, దసరా పండగలకు ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించడంతో కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. పండుగ సెలవులు ముగియడంతో జిల్లా ప్రజలు పట్టణాల బాట పట్టారు.
బెల్లంపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : బతుకమ్మ, దసరా పండగలకు ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించడంతో కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. పండుగ సెలవులు ముగియడంతో జిల్లా ప్రజలు పట్టణాల బాట పట్టారు.
14 రోజుల్లో ఆర్టీసీ ఆదాయం రూ. 4.68 కోట్లు
జిల్లాలో మొత్తం ఆర్టీసీ బస్సులు 125 ఉన్నాయి. ఇందులో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, స్లీపర్, రాజధాని, లహరి బస్సులు ఉన్నాయి. బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేకంగా 50కి పైగా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది ప్రయాణికులు హైద్రాబాద్ నుంచి జిల్లాలోని వారి సొంత ఊర్లకు రావడం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేకంగా హైద్రాబాద్ (జేబీఎస్)కు 27 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులు మొత్తం 83,77,079 కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్ధానాలకు చేర్చాయి. 8,27,740 మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్ధానాలకు చేరవేసి రూ. 4,68,43,648 ఆదాయం సాధించింది.
తిరుగు ప్రయాణంలో....
సొంత ఊర్లలో ఉత్సాహంగా పండుగ చేసుకున్న జిల్లా ప్రజలు హైద్రాబాద్, ఇతర పట్టణాలకు తిరుగు ప్రయాణం కావడంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రజలు తరలి వెళ్తున్నారు. దీంతో రద్దీకి అనుగుణంగా మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు కేటాయించారు. మరో రెండు రోజుల పాటు తిరుగు ప్రయాణం చేసే వారి కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
అందరి కృషితోనే ఆదాయం
జనార్దన్, డీఎం, మంచిర్యాల
ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండకర్ల సహకారంతో ఆర్టీసీకి ఆదాయం కలిసి వచ్చింది. పండగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా అదనపు బస్సులను ఏర్పాటు చేశాం. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు. ఆర్టీసీపై ఆదరణ చూపిన ప్రయాణికులకు కృతజ్ఞతలు.
Updated Date - Oct 15 , 2024 | 10:39 PM