తొలిమెట్టు తడబాటు
ABN, Publish Date - Oct 18 , 2024 | 10:38 PM
చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం జిల్లాలో నామమాత్రంగా అమలవుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం లక్ష్యం నీరుగారుతోంది. కరోనా మహమ్మారి విద్యా రంగంలో తీవ్ర ప్రభావాన్ని చూపింది.
మంచిర్యాల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం జిల్లాలో నామమాత్రంగా అమలవుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం లక్ష్యం నీరుగారుతోంది. కరోనా మహమ్మారి విద్యా రంగంలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. పాఠశాల విద్యలో విద్యార్థులు వారి వారి తరగతులకు చెందిన సామర్థ్యాలను సాధించగలిగినపుడే నాణ్యమైన విద్య సాకారమవుతుంది. కరోనా కాలంలో ఆన్‌లైన్ తరగతుల ద్వారా ఇంట్లోనే చదుకోవలసిన పరిస్థితి వచ్చింది. పాఠశాల విద్య తిరిగి గాడిలో పడిన తర్వాత చిన్నారుల్లో విద్యా సామర్థ్యాలను పరిశీలిస్తే దారుణంగా పడిపోయినట్లు గుర్తించారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం. అక్షరాలను గుర్తించడం, లెక్కలు చేయడం రానివారు అనేక మంది ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. దీనిని గుర్తించిన విద్యాశాఖ అటువంటి విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2022-23 విద్యా సంవత్సరం నుంచి తొలిమెట్టు (ఎఫ్‌ఎల్‌ఎన్) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గతేడాది ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పిల్లల్లో విద్యా సామర్థ్యాలు కొంత మెరుగయ్యాయి.
ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమం అమలు చేస్తారు. మౌలిక భాష, గణిత సామర్థ్యాల సాధనకు అవసరమైనట్లుగా వారంలో ఐదు రోజుల పాటు బోధన చేసి, ఒక రోజు పరీక్ష నిర్వహించాలి. బేస్‌లైన్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను విభజించి కృత్యాల బోధన చేపట్టాలి. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, స్లిప్ టెస్ట్, రాత పనులు అంతర్భాగంగా నిర్వహించాలి. సంబంధిత వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియంతా జిల్లాలోని పాఠశాలల్లో నామమాత్రంగా నిర్వహిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి.
విద్యా సంవత్సరంలో 220 రోజుల పనిదినాలు ఉండగా, 140 రోజులు బోధనాభ్యాసన ప్రక్రియ నిర్వహించాలి. వారానికి ఐదు రోజులు బోధనాభ్యాసం, ఒక రోజు మూల్యాంకనం, పునరాభ్యాసం చేయించాలి. విద్యార్థులంతా భాగస్వాములు అయ్యేలా వార్షిక, అర్థవార్షిక, త్రైమాసిక, రోజువారి కాలాంశం లేదా పీరియడ్ ప్రణాళిక రూపొందించాలి.
బదిలీలు, పదోన్నతులతో బ్రేక్....
ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులతో కార్యక్రమం అమలుకు బ్రేక్ పడింది. అధికారులంతా బీజీగా ఉన్నందున పర్యవేక్షణ కొరవడింది. ఈ ఏడాది తొలిమెట్టు అమలుపై ఉపాధ్యాయులకు శిక్షణే ఇవ్వలేదు. జిల్లాలో 655 పాఠశాలలను కార్యక్రమం కోసం ఎంపిక చేయగా 14,836 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. సింహభాగం స్కూళ్లలో సంపూర్ణంగా అమలు కావడం లేదు. దీంతో చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించే ప్రక్రియ అటకెక్కినట్లయింది.
Updated Date - Oct 18 , 2024 | 10:38 PM