ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరనున్న అంత్యక్రియల కష్టాలు

ABN, Publish Date - Oct 05 , 2024 | 10:27 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ శ్మశాన వాటిక నిర్మాణానికి ఎట్టకేలకు లైన్‌క్లియర్‌ అయింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు చొరవతో గోదావరి సమీపంలోని భూదాన్‌ యజ్ఞ బోర్డు భూముల్లో నిర్మాణానికి మార్గం సుగమమైంది.

మంచిర్యాల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ శ్మశాన వాటిక నిర్మాణానికి ఎట్టకేలకు లైన్‌క్లియర్‌ అయింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు చొరవతో గోదావరి సమీపంలోని భూదాన్‌ యజ్ఞ బోర్డు భూముల్లో నిర్మాణానికి మార్గం సుగమమైంది. భూదాన్‌ భూముల్లో ఎకరం విస్తీర్ణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4 కోట్ల అంచనాతో నిర్మించనున్న శ్మశాన వాటికకు ఈ నెల 3న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు శంకుస్థాపన చేశారు. దహన సంస్కారాల నిర్వహణ, కర్మకాండలు జరుపుకునేందుకు వీలుగా అవసరమైన గదుల నిర్మాణం, నీటి వసతి, తదితర అన్ని హంగులతో నిర్మాణం జరుగనుంది.

ప్రైవేట్‌ నిర్మాణమే ఆధారం....

జిల్లా కేంద్రంలో హిందువులు మరణించిన పక్షంలో గోదావరి తీరంలో అంత్యక్రియలు నిర్వహించడం దశాబ్దాల కాలంగా వస్తున్న సాంప్రదాయం. అయినప్పటికీ స్థానికంగా శ్మశాన వాటిక నిర్మించడంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు గోదావరి ఒడ్డున దహన సంస్కారాలు నిర్వహించేవారు. దీంతో పట్టణానికి చెందిన వ్యాపారి గుండా సుధాకర్‌ నది ఒడ్డున అతనికి చెందిన స్థలంలో ప్రజల సౌకర్యార్థం సొంత ఖర్చులతో శ్మశాన వాటికను నిర్మించారు. కొంతకాలంగా ప్రజలు ఆ వాటికలో అంత్యక్రియలు జరుపుతున్నారు. అయితే వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగినప్పుడల్లా ఆ శ్మశాన వాటిక పూర్తిగా నీట మునుగుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుండటంతో సదరు వ్యాపారి గోదావరి రోడ్డులోనే మరో స్థలంలో అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు వెసలుబాటు కల్పించారు. వ్యాపారి చొరవతో ప్రజలకు ఇబ్బందులు తప్పినప్పటికీ మున్సిపాలిటీ పరంగా శ్మశాన వాటిక లేదు. వ్యాపారి నిర్ణయంతో అంత్యక్రియలకు ఇబ్బందులు తొలగినప్పటికీ 11 రోజులపాటు కర్మకాండలు జరుపుకునేందుకు ప్రజలు చెట్లు, పుట్టలను ఆశ్రయించాల్సి వచ్చేది.

స్థల సేకరణకు రూ.కోటి వసూలు

గోదావరి సమీపంలో హిందూ శ్మశాన వాటిక నిర్మించేందుకు అవసరమైన స్థల సేకరణకు గత పాలకులు రూ.కోటి చందాలు వసూలు చేశారు. పట్టణానికి చెందిన ప్రముఖులు తమ వంతుగా చందాలు అందజేశారు. అలా పోగైన డబ్బులతో రెండు మూడు సంవత్సరాల క్రితం గోదావరిని ఆనుకొని ఎకరం స్థలం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే అదే సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ స్థలం పూర్తిగా నీటి మునిగింది. దీంతో అక్కడ శ్మశాన వాటిక నిర్మిస్తే ఫలితం ఉండదన్న ఉద్దేశ్యంతో నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో శ్మశాన వాటిక అంశం గాలిలో కలిసిపోగా వసూలైన డబ్బులు వృథా అయ్యాయి. అప్పట్లో ఈ విషయమై పెద్ద రాద్దాంతమే జరిగింది. చందాలు ఇచ్చిన ప్రముఖులు వాటి లెక్కలపై ఆరా తీయడంతో వివాదానికి సైతం దారి తీసింది.

వరద ముంపునకు గురికాకుండా....

ప్రస్తుతం భూదాన్‌ భూముల్లో శ్మశాన వాటికకు శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భూదాన్‌ భూముల్లో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం వర్షాకాలంలో తరుచుగా వరదపోటుకు గురవుతుండగా, మళ్లీ శ్మశాన వాటిక అదే ప్రాంతంలో నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి సందేహాలను నివృత్తి చేసేలా ఎంపిక చేసిన స్థలం వరద ముంపునకు గురికాకుండా చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రాళ్లవాగు నుంచి మొదలుకొని గోదావరి వరకు ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రూ.260 కోట్ల అంచనాతో నిర్మించ తలపెట్టిన కరకట్టలకు సంబంధించి గత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌ కేటాయించారు. నిధులు విడుదల కాగానే త్వరలో టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి కరకట్టల నిర్మాణం ప్రారంభిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరకట్టల నిర్మాణం జరిగితే గోదావరి తీరం వెంట అసలు ముంపు భయం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దహన సంస్కారాలు, కర్మకాండల కోసం దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Updated Date - Oct 05 , 2024 | 10:27 PM