తెరపైకి వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ
ABN, Publish Date - Oct 14 , 2024 | 10:42 PM
రెవెన్యూశాఖలో కీలకంగా వ్యవహరించి ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాన్ని అన్నీ తామై నడిపించిన వీఆర్వో, వీఆర్‌ఏల వ్యవస్థను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గ్రామస్థాయిలో రెవెన్యూశాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కారు తిరిగి వారి సేవలను వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తోంది.
మంచిర్యాల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూశాఖలో కీలకంగా వ్యవహరించి ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాన్ని అన్నీ తామై నడిపించిన వీఆర్వో, వీఆర్‌ఏల వ్యవస్థను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గ్రామస్థాయిలో రెవెన్యూశాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కారు తిరిగి వారి సేవలను వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తోంది. రెవెన్యూశాఖలో వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారా గ్రామస్థాయిలోని రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వం ఆలోచనలను స్వాగతిస్తూ వివిధ శాఖల్లో పనిచేస్తున్న వీఆర్వో, కొందరు వీఆర్‌ఏలు మాతృశాఖలో వెళ్లి విధులు నిర్వర్తించుకోవచ్చనే ఉత్సాహంలో ఉన్నారు.
వీఆర్వోల ప్రస్థానం....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్న సమయంలో వీఏవో (విలేజ్ ఆడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్)లకు గ్రామ కార్యదర్శులుగా అదనపు బాధ్యతలు అప్పగించి వేతనం పెంచారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారిని వీఆర్వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)లుగా గుర్తించి గ్రామ రెవెన్యూ బాధ్యతలను అప్పగించారు. అనాటి నుంచి వీఆర్వోలుగా కొనసాగుతూ వస్తున్నారు. 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ధరణిని తీసుకొచ్చింది. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలో జరిగిన అనేక మోసాలు, అవినీతిపై కుప్పలు తెప్పలుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖలోని వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను 2020లో రద్దు చేసింది. వారందరినీ ప్రభుత్వంలోని ఇతర 36 శాఖల్లోకి సర్దుబాటు చేసింది. ఈ విషయంపై వీఆర్వోలు కోర్టుకు వెళ్లగా ఇప్పటికీ తీర్పు రిజర్వులోనే ఉంది.
బదలాయింపుల్లో అన్యాయం
2023 ఆగస్టులో జరిగిన వీఆర్‌ఏల బదలాయింపుల్లో వారి విద్యార్హతను బట్టి రెవెన్యూతో పాటు మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డు ఆసిస్టెంట్, అటెండర్స్‌గా అవకాశం కల్పించారు. మంచిర్యాల జిల్లాలో 542 మంది వీఆర్‌ఏలు ఉండగా, ప్రస్తుతం రెవెన్యూ శాఖలో 260 మంది విధులు నిర్వహిస్తున్నారు. మిగతా వారిలో అధిక శాతం మందిని ఇతర శాఖల్లోకి పంపించారు. శాఖల బదలాయింపుల్లో భాగంగా వారంతా జీరో సర్వీసు నుంచి తిరిగి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో ఇంతకాలం చేసిన కాలాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇదిలా ఉండగా నిరక్షరాస్యులతోపాటు వయస్సు పైబడిన వారిని మాత్రం రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
పదోన్నతులకు దూరం
వీఆర్వో, వీఆరేఏ వ్యవస్థ రద్దు కావడంతో ఆయా విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయగా జూనియర్ ఆసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ హోదాల్లో ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. శాఖల బదలాయింపుతో అప్పటికే తమ సీనియారిటీ పోయిందన్న ఆందోళనలో ఉన్న వీఆర్వో, వీఆర్‌ఏలకు మళ్లీ పాత పోస్టింగ్ సంకేతాలు వెలువడుతుండటంతో ఆందోళన రేకెత్తుతోంది. ఇప్పటికే సీనియారిటీ పోయిందని ఆవేదన చెందుతుండగా, వెనక్కి పంపితే సర్వీసు నిబంధనలు ఎలా ఉంటాయోననే దిగులు వారిలో కనిపిస్తోంది. ఇదిలా ఉండగా రెవెన్యూశాఖలో అనేక సంవత్సరాలు పని చేసినప్పటికీ వారందరూ ఆయా శాఖల్లో జీరో సర్వీసు నుంచి ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. రెండేళ్ల ప్రొహిబిషన్ కాలవ్యవధి తర్వాత ఇటీవలే వారి రెగ్యులరైజేషన్ మొదలైంది. దీంతో పదిహేను, పదహారు ఏళ్ల నుంచి చేసిన సర్వీసు అంతా వృథా అయిపోయింది. కొద్ది రోజుల్లో వీఆర్వో నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతులు పొందే సమయంలో గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ వ్యవస్థను రద్దు చేయడంతో అర్హత ఉన్న వారంతా సర్వీసులను కోల్పోయి పదోన్నతులకు దూరమయ్యారు.
మంత్రి వ్యాఖ్యలతో ఆందోళన....
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ పునరుద్ధరణపై రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో వీఆర్వోలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వీఆర్వో, వీఆర్‌ఏల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి పరీక్ష నిర్వహిస్తామని, రెవెన్యూ సర్వీసులోకి రావాలంటే పరీక్ష రాయాల్సిందేనని స్పష్టం చేయడంతో ఇప్పటి వరకు నూతన ఉత్తేజంతో ఉన్న వీఆర్వోలు ఆందోళనకు గురవుతున్నారు. చాలా కాలంగా రెవెన్యూ వ్యవస్థలో పనిచేసినందున తమను మళ్లీ వెనక్కు తీసుకుంటే ప్రభుత్వానికే మేలు జరుగుతుందనే అభిప్రాయంలో వీఆర్వోలు ఉన్నారు. ఇంతకాలం పనిచేసిన అనుభవం ఉండగా, కొత్తగా పరీక్ష పేరుతో తమను రెవెన్యూశాఖకు దూరం చేయాలనుకుంటే ప్రభుత్వానికే నష్టం జరుగుతుందనేది వారి భావన.
సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి
సాగె ఓంకార్, రికార్డు అసిస్టెంట్, రెవెన్యూశాఖ
వీఆర్‌ఏగా రెవెన్యూశాఖలో 15 యేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా. 2020లో మా సహచరులంతా ఇతరశాఖలకు వెళ్లినప్పటికీ నేను మాతృశాఖలోనే ఉండిపోయా. కొన్నేళ్లుగా రెవెన్యూశాఖలో విధులు నిర్వర్తించిన వీఆర్‌వోలు అంతా వేరే శాఖల్లో చేరి జీరో సర్వీసుతో కొనసాగుతున్నారు. రెవెన్యూ శాఖలోకి ప్రభుత్వం రీపోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నందున ఇంతకాలం చేసిన సర్వీసును పరిగణలోకి తీసుకొని న్యాయం జరిగేలా చూడాలి. అలాగే ఇంటర్ విద్యార్హతలు ఉన్న వాళ్లందరికీ నేరుగా అవకాశం ఇవ్వాలి. లేదంటే సీనియారిటీ ప్రకారం ఇస్తే మేలు జరుగుతుంది.
Updated Date - Oct 14 , 2024 | 10:42 PM