ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన్‌ కార్డులు ఇచ్చేదెప్పుడు...?

ABN, Publish Date - Oct 07 , 2024 | 10:50 PM

కొత్త రేషన్‌ కార్డుల జారీకి మోక్షం లభించడం లేదు. ఈనెల 2వ తేదీ నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల నుంచి రేషన్‌ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు.

మంచిర్యాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్‌ కార్డుల జారీకి మోక్షం లభించడం లేదు. ఈనెల 2వ తేదీ నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల నుంచి రేషన్‌ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త కార్డులను జారీ చేయడం లేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథ కాలకు దూరం అవుతున్నారు.

రేషన్‌ కార్డుల జారీకి కాంగ్రెస్‌ హామీ...

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ 2018 వరకు రేషన్‌ కార్డులను జారీ చేసింది. 2018 డిసెంబర్లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసింది. ఆ తర్వాత అనేకమంది దరఖాస్తులు చేసుకోగా, వాటిని 2022 సంవత్సరంలో పరిశీలించి, అందులో అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేశారు. ఆ తరువాత వెబ్‌సైట్‌ను మూసివేసిన ప్రభుత్వం మళ్లీ రేషన్‌ కార్డులు ఇవ్వలేదు. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే రేషన్‌ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ మేరకు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టింది. ఆరు గ్యారంటీ పథకాలతోపాటు కొత్త రేషన్‌ కార్డులను జారీ చేస్తామని ప్రకటించారు. మొదట డిసెంబర్‌ 9వ తేదీ నుంచి ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకంలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు పథకాలను అమలు చేసేందుకు డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ, వార్డు సభల్లో ఐదు గ్యారంటీ పథకాలు వర్తింపజేందుకు స్వీకరించిన దరఖాస్తులతోపాటు, కొత్త రేషన్‌ కార్డుల కోసం కూడా అధికారులు దరఖాస్తులను స్వీకరించారు.

దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500ఇవ్వడం, రూ. 500కే వంట గ్యాస్‌ పథకం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, తెలంగాణ ఉద్యమ కార్డులకు 250 గజాల స్థలంతో పాటు ఇళ్లు మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా, చేయూత కింద కొత్తగా పింఛన్‌ మంజూరు కోసం ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని రూపొందించారు. కోరిన విధంగా దరఖాస్తులను పూరించిన ఆశావహులు వాటిని అధికారులకు అందజేశారు. వీటితోపాటు రేషన్‌ కార్డులు లేనటువంటి వాళ్లు తెల్ల రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

జిల్లాలో 15వేల పైచిలుకు దరఖాస్తులు

జిల్లాలో రేషన్‌ కార్డుల కోసం 15వేల పై చిలుకు దరఖాస్తులు వచ్చాయి. వాటిని జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఆ తర్వాత కొత్త రేషన్‌ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహా సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘం అర్హులైన వారికి రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ నెల 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించినప్పటికీ, ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. దీంతో రేషన్‌ కార్డుల జారీ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు నిరాశ, నిస్ప్రహలకు గురవుతున్నారు. రేషన్‌ కార్డులు లేక మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన రూ.500కే సబ్సిడీ వంట గ్యాస్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం పొందలేకపోతున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేయగా, కార్డులు లేని వారికి రుణమాఫీ కాలేదు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదికను పంపించారు. కానీ ఇంకా రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమకాలేదు. రేషన్‌ కార్డు ఉంటే అందరితోపాటు తమకు కూడా రుణమాఫీ అయ్యేదనే అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్‌ కార్డులను జారీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 07 , 2024 | 10:50 PM