Adivasis: నక్సల్స్‌కు వ్యతిరేకంగా ఆదివాసీల ర్యాలీ
ABN, Publish Date - Nov 24 , 2024 | 03:42 AM
తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారంటూ ఇద్దర్ని చంపిన మావోయిస్టుల దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఏటూరునాగారంలో ఆదివాసీలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దర్ని చంపారని ఏటూరు నాగారంలో నిరసన
ఏటూరునాగారం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారంటూ ఇద్దర్ని చంపిన మావోయిస్టుల దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఏటూరునాగారంలో ఆదివాసీలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారన్న నెపంతో ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్, అతడి పెదనాన్న కుమారుడు ఉయిక అర్జున్‌ను మావోయిస్టులు గురువారం అర్ధరాత్రి నరికి చంపిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసగా ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీలు, గొత్తికోయలు.. సుమారు 2 వేల మంది ఫ్లకార్డులు చేతపట్టి ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయం నుంచి వై-జంక్షన్ మీదుగా బస్టాండ్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
బస్టాండ్‌లో రాస్తారోకో చేశారు.ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మావోయిస్టుల పోరాటం అంటే అమాయక ఆదివాసీలను చంపడమేనా? అని ప్రశ్నించారు. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం రమేష్, అర్జున్‌లను చంపడం అమానుషమన్నారు. ఈ హత్యలపై ప్రజా సంఘాల నాయకులు స్పందించాలని కోరారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Nov 24 , 2024 | 03:42 AM