Peter Diamandis: ఏఐతో ఆయుర్దాయం పెంపు!
ABN, Publish Date - Sep 06 , 2024 | 03:49 AM
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)తో మనిషి ఆయుర్దాయాన్ని పెంచే సాంకేతిక పరిజ్ఞానం పదేళ్లలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త, రచయిత డాక్టర్ పీటర్ డియెమాండిస్ తెలిపారు.
పదేళ్లలో సాధ్యమే.. ఒక్క ఏడాది
పెరిగినా రూ.వేల కోట్ల సంపద సృష్టి
అమెరికా పారిశ్రామికవేత్త
డాక్టర్ పీటర్ డియెమాండిస్ కీలకోపన్యాసం
పదేళ్లలో సాధ్యమే..
ఒక్క ఏడాది పెరిగినా రూ.వేల కోట్ల సంపద సృష్టి
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)తో మనిషి ఆయుర్దాయాన్ని పెంచే సాంకేతిక పరిజ్ఞానం పదేళ్లలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త, రచయిత డాక్టర్ పీటర్ డియెమాండిస్ తెలిపారు. సాంకేతిక రంగంలో మానవాళి గత వందేళ్లలో సాధించిన అభివృద్ధి.. ఏఐతో వచ్చే పదేళ్లలో సాధించినా ఆశ్చర్యం లేదన్నారు. హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైన ఏఐ సదస్సులో పీటర్ కీలకోపన్యాసం చేశారు. ‘ఏఐతో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల వయసున్న పిల్లలు కూడా చాట్ జీపీటీ ఉపయోగించి చదువుకునే రోజులు ఏంతో దూరంలో లేవు.
డ్రోన్లతో వ్యవసాయం చేస్తామని ఎప్పుడైనా ఊహించామా? డ్రైవర్ రహిత వాహనాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వైద్య రంగంలో ఏఐ అద్భుతాలు చేస్తోంది. సమస్త విజ్ఞానం సెల్‌ఫోన్‌లోకి వచ్చేసింది. ఏఐతో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు మనిషి ఆయుర్దాయాన్ని పెంచే టెక్నాలజీని ఎందుకు అభివృద్ధి చేయకూడదనే ఆలోచన శాస్త్రవేత్తల్లో మొదలైంది. ఈ దిశగా మా సంస్థ కూడా కృషి ప్రారంభించింది’ అని పీటర్ డియెమాండిస్ వెల్లడించారు. వచ్చే పదేళ్లలో మనిషి ఆయుర్దాయాన్ని పెంచే సాంకేతికతను తీసుకురాగలమని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారన్నారు.
జీవిత కాలాన్ని ఒక ఏడాది పెంచగలిగినా రూ.వేల కోట్ల విలువైన అదనపు సంపదను సృష్టించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏఐతో తలెత్తే సమస్యల గురించి ప్రస్తావిస్తూ.. ఏ సాంకేతిక పరిజ్ఞానంతోనైనా కొన్ని సమస్యలు ఉంటాయని, ఆహార ఉత్పత్తిలో కొత్త ఆవిష్కరణలు జరగకపోతే ప్రపంచ మానవాళికి అవసరమైన ఆహారాన్ని అందించగలిగే వాళ్లమేనా? అని ప్రశ్నించారు. ఏఐతో తలెత్తే సమస్యలను ఎలా అధిగమించాలనే దానిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
వయోధికుల అనుభవాలను పదిలపర్చాలి
భారత్‌లో అపారమైన మానవ వనరులు ఉన్నాయని, లక్షలాది మంది సాంకేతిక నిపుణులున్నారని పీటర్ డియెమాండిస్ గుర్తు చేశారు. ‘ఏఐ రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తోంది. దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న 70 ఏళ్లకు పైబడిన వయోధికుల మనసుల్లో ఏముంది? వారి ఆలోచనలు, పూర్వీకుల నుంచి వారు అందిపుచ్చుకున్న సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన వివరాలను భద్రపరచాలి.
వాటిని ముందుతరాలకు అందించేలా ఏఐ సహకారంతో కృషి చేయాలి’ అని సూచించారు. ఏఐపై యువతలో ఆసక్తి పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పీటర్ డియెమాండిస్ తాజాగా ‘లాంగివిటీ’ అనే పుస్తకాన్ని రచించారు. కొత్త ఆవిష్కరణలు చేసే వారిని ప్రోత్సహించటం కోసం ఎక్స్‌ప్రైజెస్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. - స్పెషల్ డెస్క్
Updated Date - Sep 06 , 2024 | 03:49 AM